అస్త్రాలు సిద్దంగా ఉన్నాయన్న టిడిపి ఎంపీలు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి ): కేంద్ర బడ్జెట్‌పై టీడీపీ ఎంపీలు అసంతృప్తి వెళ్లగక్కారు. రాష్ట్ర విభజన జరిగి 9నెలలు అవుతున్నా.. విభజన చట్టంలోని హావిూలను నెరవేర్చలేదని టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మా పరిస్థితి విరాటపర్వంలో పాండవుల్లా తయారైంది.’ అని చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ అన్నారు. బీజేపీపై పోరాటానికి అస్త్రాలు అన్నీ సిద్ధం చేసి ఉంచామని, తమ అధినేత ఆదేశిస్తే అమలు చేస్తామని ఎంపీ శివప్రసాద్‌ చెప్పారు. ఈ బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేక పోవడం తమను నిరాశకు గురిచేసిందని ఎంపీలు శివప్రాసద్‌, గల్లా జయదేవ్‌ తదితరులు అన్నారు. తాము ఎంతగానో ఆశించామని అన్నారు. కేంద్రంతో పోరాటానికి తాము సిద్దంగా ఉన్నామని, తమ అస్త్రాలు జమ్మిచెట్టువిూద ఉన్నాయని శివప్రసాద్‌ అన్నారు. బాబు ఆదేశిస్తే ఇక కార్యక్షేత్రంలోకి దిగుతామని అన్నారు. గత పదేళ్లలో పాడైపోయిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేవిధంగా బ్జడెట్‌ ఉందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలకు, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు బ్జడెట్‌ ప్రోత్సాహకరంగా ఉందన్నారు. బ్జడెట్‌లో ఏపీ విషయంలో నిన్నటికి, ఇవాళ్టికి తేడా లేదన్నారు. అయితే ఎపికి సంబంధించినంత వరకు హావిూలపై పోరాడాల్సి ఉందన్నారు.