అస్సాంలో ఉద్రిక్తంగా ఆందోళనలు


` పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి!
` రాష్ట్ర ప్రభుత్వమే హింసను ప్రోత్సహిస్తోంది
` రాహుల్‌గాంధీ ఆరోపణ
గుహవాటి,సెప్టెంబరు 23(జనంసాక్షి): ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఏర్పాటైన నివాసాలను తొలగించేందుకు అస్సాం అధికారులు చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌ హింసాత్మకంగా మారింది. దీన్ని వ్యతిరేకించిన స్థానికులు.. తమకు పునరావాస ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ గత నాలుగు రోజులుగా నిరసన కార్యాక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా గురువారం నాడు పోలీసులకు ఆందోళనకారులకు తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఒకానొక సమయంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోగా.. మరో పది మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు పోలీసు అధికారులు వెల్లడిరచారు.
అస్సాంలోని దరాంగ్‌ జిల్లా సిపాజర్‌ ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన స్థలంలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దాదాపు ఇక్కడ 800 కుటుంబాలు అక్రమంగా నివాసం ఉంటున్నట్లు తేల్చిన అధికారులు.. వారిని అక్కడ నుంచి తరలించే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అయితే, తమకు సమగ్ర పునరావాస ప్యాకేజీని ప్రకటించాలని స్థానికులు నిరసన చేపట్టారు. తమకు అడ్డువచ్చిన పోలీసులపై కర్రలు, రాళ్లతో ఆందోళనకారులు ఎదురుదాడికి దిగారు. దీంతో లాఠీలకు పనిచెప్పిన పోలీసులు.. ఆందోళనకారులను తరిమికొట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు కాల్పులు జరపడంతో పరిస్థితి మరింత హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో పది మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు.
ప్రభుత్వమే హింసను ప్రోత్సహిస్తోంది: రాహుల్‌ గాంధీ
అస్సాంలో సెప్టెంబర్‌ 4వ తేదీన మొదలైన ఈ డ్రైవ్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్రమ నిర్మాణాలకు తొలగిస్తూ ఇప్పటివరకు దాదాపు 800 కుటుంబాలను తరలించారు. ఆందోళనలు చేపట్టినప్పటికీ అక్రమ నిర్మాణాలను తొలగించే కార్యక్రమాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపబోమని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. ఈ బాధ్యత పోలీసులకు అప్పగించామన్నారు. అయితే, ఈ హింసాత్మక ఘటనలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. అస్సాంలో రాష్ట్ర ప్రభుత్వమే హింసను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలకు సంఫీుభావం తెలిపిన ఆయన.. దేశప్రజలెవ్వరూ ఇటువంటి ఘటనలను సహించరని అన్నారు.