‘ఆంధ్ర’ దంపతులకు శిక్ష

ఓస్లో: డిసెంబర్‌ 3, (జనంసాక్షి):

పిల్లలను సక్రమంగా పెంచటం లేదంటూ క్రిమినల్‌ అభియోగాలు ఎదుర్కొంటున్న  ‘ఆంధ్ర’ దంపతులు వల్లభనేని చంద్రశేఖర్‌, అనుపమలకు శిక్ష విధించే అంశంపై ఇక్కడి ప్రత్యేక న్యాయస్థానం తన తీర్పును మంగళవారం వెలువరించనుంది. సోమవారం జరిగిన వాదప్రతివాదనలో ప్రాసిక్యూషన్‌ ఈ కేసులో ‘అత్యంత తీవ్రమైనది’గా పరిగణించాలంటూ ఆంధ్రదంపతుల అరెస్ట్‌ను గట్టిగా సమర్థిచాయి. ఈ కేసు విషయమై ఓస్లో పోలీసుశాఖ ప్రాసిక్యూషన్‌ విభాగం అధిపతి కుర్డ్‌ లిర్‌ ‘పీటీఐ’తో మాట్లాడారు ‘వారికి మంగళవారం శిక్ష ఖరారవుతుంది. ఆ తల్లిదండ్రులు తమ కుమారుణ్ణి (సాయిశ్రీరాం) బెదిరిస్తూ హింసకు పాల్పడుతూ పదే పదే క్రూరంగా ప్రవర్తించారు. ఇది సెక్షన్‌ 219కిందికి వస్తుంది’ అని చెప్పారు. ఇటువంటి కేసులు విదేశీయిలకేనా లేక నార్వేజియన్లకు కూడా వర్తిస్తాయా.? అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు ఆయన బదులిస్తూ చట్టం ఎవరికైనా ఒకటేనని, తమకు తరచు ఎదురయ్యే ఇటువంటి కేసుల్లో కేవలం విదేశీయిలకు మాత్రమే కాక నార్వేజియన్లకు కూడా ప్రమేయం వుంటున్నదని ఆయన వివరించారు.  చంద్రశేఖర్‌ తరపు న్యాయవాది మార్డ్‌బ్రోట్రోమ్‌ మాట్లాడుతూ భారతీయ జంటను నార్వే జైలులో వుంచటం చట్టవిరుద్ధమని, కోర్టు వారిని శిక్షిస్తే దానిపై తాము అప్పీలు చేస్తామన్నారు. నార్వే న్యాయస్థానాల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోబోమని  భారత్‌ ఇప్పటికే ప్రకటించింది. ఈ కేసు ఒక ప్రైవేటు పౌరుడికి, స్థానిక చట్టాలకు సంబంధించిన అంశమని న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షిద్‌ వ్యాఖ్యానించారు.