కుంభమేళాతో ప్రపంచమే ఆశ్చర్య పోయింది
` ఐక్యత కోసం జరిగిన మహాయజ్ఞమిది
` ఎవరికైనా అసౌకర్యం కలిగితే క్షమించండి
` కుంభమేలా ముగింపుపై మోడీ వెల్లడి
న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ’మహాకుంభమేళా’ ఘనంగా ముగిసింది. 45 రోజుల పాటు సాగిన ఈ కుంభమేళా విశేషాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన బ్లాగ్‌లో రాశారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత సులువు కాదన్నారు. ఏర్పాట్ల విషయంలో భక్తులెవరైనా అసౌకర్యానికి గురైతే గనుక అందుకు క్షమించాలని కోరారు. ‘ఐక్యత కోసం జరిగిన మహాయజ్ఞం దిగ్విజయంగా ముగిసింది. భారతీయ ఐక్యతకు కుంభమేళా నిదర్శనంగా నిలిచింది. అంచనాలను మించి వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. భారత్ కొత్త శక్తితో ముందుకుసాగుతోందని, నవ భారత్‌ను నిర్మించే కొత్త శకం వచ్చిందని చెప్పేందుకు ఇదే నిదర్శనం అని అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని దేనితోనూ పోల్చలేం. త్రివేణి సంగమం నదీ తీరానికి అన్ని కోట్ల మంది ఎలా వచ్చారా? అని యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ఈ భక్తులెవరికీ అధికారిక ఆహ్వానాలు పంపలేదు. అయినా పవిత్ర సంగమంలో పుణ్యస్నానాల కోసం వారంతా తరలివచ్చారు. నదిలో స్నానమాచరించిన తర్వాత వారి ముఖాల్లో కన్పించిన సంతోషం, సంతృప్తి నేనెప్పటికీ మర్చిపోలేను. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు చాలామంది వ్యయప్రయాసలకోర్చి కుంభమేళాకు రావడం ఆనందంగా ఉందని మోదీ రాసుకొచ్చారు. ఈసందర్భంగా మహాకుంభమేళాను విజయవంతం చేసిన యూపీ ప్రభుత్వం, సహకరించిన ప్రయాగ్‌రాజ్ ప్రజలు, భక్తులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ‘ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం అనేది అంత సులువు కాదని తెలుసు. మా పూజల్లో ఏదైనా లోపం ఉంటే క్షమించాలని ఆ గంగా, యమునా, సరస్వతి మాతలను ప్రార్థిస్తున్నా. భగవంతుని స్వరూపాలుగా భావించే భక్తులకు సేవ చేయడంలో ఏదైనా లోపం ఉంటే అందుకు ప్రజలు కూడా క్షమించాలని కోరుతున్నా‘ అని మోదీ రాసుకొచ్చారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు సాగిన మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. సామాన్య పౌరులతో పాటు పలువురు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఫిబ్రవరి 10, ప్రధాని మోదీ ఫిబ్రవరి 5న కుంభమేళాను సందర్శించి పుణ్యస్నానం చేశారు.