పురోగతి లేదు: హరీశ్
` ప్రచారాల మీద ఉన్న శ్రద్ధ…. ప్రాణాల మీద లేదు
` ఎస్‌ఎల్‌బీసీ ఘనటపై సీఎం బాధ్యతారాహిత్యం
` సహాయక చర్యల్లో ఘోరంగా వైఫల్యం
` ఎస్‌ఎల్‌బీసీ వద్దకు వెళ్లనీయకుండా భారాస నేతను అడ్డుకున్న పోలీసులు
` రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు
హైదరాబాద్(జనంసాక్షి):ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్దకు వెళ్లే ముందు హైదరాబాద్ హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఎస్‌ఎల్‌బీసీ ఘటనలో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆరోపించారు. వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని సాధించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ బృందాలు, రాష్ట్ర ప్రభుత్వ బృందాలు, ఏజెన్సీ మధ్య సమన్వయం లోపించినట్టు కనిపిస్తుందన్నారు. వీరికి డైరెక్షన్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది అని హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రులు అక్కడికి వెళ్లి హెలికాప్టర్లలో టీవీ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి పోటీ పడుతున్నారు తప్ప, సహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని పేర్కొన్నారు. పైనుంచి హెలికాప్టర్‌లో చూస్తే సొరంగం లోపల ఏమన్నా కనిపిస్తాదా, ప్రత్యేకంగా చూడడానికి వీఎక్స్ రే కెమెరాలు ఉన్నాయా? హెలికాప్టర్లలో చెక్కర్లు కొట్టుడు టీవీ ఇంటర్వ్యూలు ఏమిటో నాకు అర్థం కావడం లేదని తెలిపారు. వారి ప్రాణాలు కాపాడటానికి ప్రతి నిమిషం కూడా చాలా ముఖ్యమైనదని.. క్షణం కూడా చాలా విలువైనదని తెలిపారు. సొరంగం లోపల ఆహారం లేక తాగునీరు లేక చావు బ్రతుకుల మధ్య కొట్టాడుతున్నారని ఆదేవన వ్యక్తం చేశారు. వారి ప్రాణాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ధ కరువైందేమోనని అనిపిస్తుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా? ఎన్నికల ప్రచారం ముఖ్యమా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కనీసం అక్కడికి వెళ్లి, ఒక డైరెక్షన్ ఇవ్వడంలో రేవంత్ రెడ్డి, నీటి పారుదల మంత్రి పూర్తిగా ఫెయిలయ్యారని ఆరోపించారు.తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి, ఇతరుల మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
ఎస్‌ఎల్‌బీసీ వద్దకు వెళ్లనీయకుండా హరీశ్‌రావును అడ్డుకున్న పోలీసులు
ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు వద్దకు మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డితో పాటు పలువురు నేతలు చేరుకున్నారు. అయితే సొరంగంలోకి వెళ్లనీయకుండా హరీశ్‌రావు బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హరీశ్‌రావు, ఇతర నాయకులు రోడ్డుపైనే బైఠాయించిన నిరసన తెలిపారు. పోలీసుల తీరుపై హరీశ్‌రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనను పరిశీలించేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన బీఆర్‌ఎస్ నేతలు హైదరాబాద్ నుంచి గురువారం బయల్దేరిన సంగతి తెలిసిందే. కల్వకుర్తిలో బీఆర్‌ఎస్ నేతలతో కలిసి హరీశ్‌రావు టీ తాగారు. అనంతరం అక్కడ్నుంచి నేరుగా ఎస్‌ఎల్బీసీ సొరంగం వద్దకు చేరుకున్నప్పటికీ.. లోపలికి పోలీసులు అనుమతించడం లేదు. భారీగా పోలీసులు మోహరించారు. మీడియాపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు.
సీఎం రేవంత్‌దే పూర్తి బాధ్యత
` పనులపై అవగాహన లేక ఇతరులపై నిందలు:కేటీఆర్
హైదరాబాద్(జనంసాక్షి):సీఎంకు ఏపని ఎలా చేయాలో తెలియక ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పదేళ్ల నాటి ప్రాజెక్టు పనులను నిపుణులను సంప్రదించకుండానే ప్రారంభించారని, 8 మంది కార్మికులు టన్నెల్ చిక్కుకోవడానికి అదే కారణమైందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఇతరులను నిందించడం మానుకుని పనిపైన దృష్టిపెట్టాలని సూచించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో 8 కార్మికులు చిక్కుకున్న ఘటనకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌ను నిందించడంపై కేటీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డికి పని చేతగాదని మండిపడ్డారు. ‘ఆయనకు ఎలా పని చేయాలో తెలియకపోతే ఇతరులపై ఆరోపణలు చేయడం సులభంగా ఉంటుందని ఎద్దేవా చేశారు. పదేళ్ల కిందటి ప్రాజెక్టు పనులను నిపుణులను, ఇంజినీర్లను సంప్రదించకుండానే మొదలుపెట్టారని విమర్శించారు. అదే ఇప్పుడు 8 మంది కార్మికులు టన్నెల్‌లోపల చిక్కుకోవడానికి కారణమైంది’ అని కేటీఆర్ ఆరోపించారు. కార్మికులు టన్నెల్ చిక్కుకుని ఇన్నిరోజలవుతున్నా ఇప్పటిదాకా వారి ఆచూకీ కనిపెట్టలేకపోయారని, వారి బతికున్నారో మరణించారో కూడా ఎవరికీ తెలియదని అన్నారు. రేవంత్ రెడ్డి ఇతరులపై నిందలు వేయడం మానుకుని పనిపై దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి ప్రవర్తన, మాటతీరు ముఖ్యమంత్రి లాగే ఉండాలని, చవకబారు మంత్రి లా ఉండకూడదని అన్నారు.