ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం
` భారీగా పోలింగ్
` 3న ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రకటన
హైదరాబాద్(జనంసాక్షి): తెలుగు రాష్టాల్ల్రో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం జరిగిన పోలింగ్ పక్రియ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ లో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే, సాయంత్రం 4 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. తెలంగాణలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ ముగిసింది. ఉమ్మడి కరీంనగర్` మెదక్`నిజామాబాద్` ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 40.61 శాతం, ఇవే జిల్లాల్లో జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 63.49 శాతం పోలింగ్ నమోదు కాగా, వరంగల్` నల్లగొండ` ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 76.35 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తెలిపారు. కాగా, వచ్చే నెల 3వ తేదీన తుది ఫలితాలను ఎన్నికల కమిషన్ వెల్లడిరచనుంది.
మంచిర్యాలలో బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణలు
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కొన్ని చోట్ల ప్రశాంతంగా, మరి కొన్ని చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లా, నస్పూర్ మున్సిపాలిటీలోని తీగల్ పహాడ్ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ కాంగ్రెస్ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్తత పరిస్థితికి దారితీసింది. దీంతో బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణులు దూసుకెళ్ళాయి. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఇరు వర్గాల మద్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా పోలీసు కమిషనర్ శ్రీనివాస్ అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించారు.స్థానిక ఎస్‌ఐ కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని స్థానిక బీజేపీ నేత కమలాకరరావు ఎస్‌ఐతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎస్‌ఐ బీజేపీ నేతపై దాడి చేశారంటూ బీజేపీ కార్కకర్తలు ఆందోళనకు దిగారు. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీజేపీ శ్రేణులపై దూసుకువచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య పరస్పరం వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఒక నొక దశలో పరిస్థితి చేజారి ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓటు హక్కను 69,134 మంది పట్ట భద్రులు, 5,693 మంది ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారులు150 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ జరిగింది. ఎన్నికల విధుల్లో 1500 మంది సిబ్బంది, 2 వేల మంది పోలీసులతో బందోబస్త్ ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలో అత్యధిక ఓటర్లు ఉన్నారు. ఇక్కడ పురుష ఓటర్లు కీలకంగా ఉన్నాయి. అలాగే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.