ఆగని పెట్రో మంట..
దిల్లీ,డిసెంబరు 6(జనంసాక్షి):దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వరుసగా అయిదో రోజు కూడా భారత చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. లీటర్ పెట్రోల్‌పై రూ. 28 పైసలు, డీజిల్‌పై రూ. 29 పైసలు పెంచుతూ ఆదివారం ఆయిల్ సంస్థలు ప్రకటించాయి. విదేశీ మారకపు రేటు, అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలు ఇంధన ధరలను పెంచాయి. పెరిగిన ధరల ప్రకారం.. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.41, లీటర్ డీజిల్ ధర రూ.73.61కు చేరింది. ముంబయిలో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 90.05, డీజిల్ ధర రూ. 89.78కు చేరింది. నవంబర్ 20 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 14 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. 2018 సెప్టెంబర్ నుంచి చూసుకుంటే ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తారస్థాయిని తాకాయి. 17 రోజుల వ్యవధిలో లీటరు పెట్రోల్‌పై రూ. 2.35, లీటర్ డీజిల్‌పై రూ. 3.15 వరకు పెంచినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి ఇంధనంపై 34 శాతం డిమాండ్ పెరగడంతో అక్టోబర్ 30న 36.9 యూఎస్ డాలర్లుగా ఉన్న బ్యారెల్ ధర డిసెంబర్ 4 నాటికి 49.5 డాలర్లకు చేరింది.