ఆగస్టు ఒకటి నుంచి వడ్డీ లేని రుణాలు

డిఆర్‌డిఎ ఎపిడి కోటేశ్వరరావు వెల్లడి
శ్రీకాకుళం, జూలై 25: స్వయం శక్తి సంఘాల సభ్యులు తీసుకుంటున్న రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందని ఈ విధానం ఆగస్టు ఒకటి నుంచి అమలవుతుందని డిఆర్‌డిఎ ఎపిడి కోటేశ్వరరావు తెలిపారు. జలుమూరు మండల కేంద్రంలోని ఇందిర క్రాంతి పథం కార్యాలయంలో జరిగిన గ్రామైక్య సంఘం సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొత్త పథకం కింద స్వయం శక్తి సభ్యులు తాము తీసుకన్న రుణాన్ని సకాంలో చెల్లిస్తే చాలని అన్నారు. సంఘాలకు అందించే బ్యాంకు అనుసంధాన రుణాలను ఈ ఏడాది 335 కోట్ల రూపాయలుగా నిర్ణయించామని అన్నారు. ఇప్పటి వరకు 72 కోట్ల రూపాయల లింకేజి రుణాలుగా అందించామని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఆయన చేతుల మీదుగా 52 కోట్ల రూపాయలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. స్త్రీ నిధి పథకం కింద రుణాలు అందించేందుకు 15కోట్ల రూపాయలు లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 675 సంఘాలకు 3.30 కోట్ల రూపాయల రుణం అందించినట్లు తెలిపారు. అభయహస్తం పథకంలో సభ్యులుగా ఉండి మృతి చెందిన వారు జిల్లాలో 9,500 ఉండగా, వీరిలో 8,500 మందికి బీమా కింద 27కోట్ల రూపాయలు అందించామని అన్నారు. మిగిలిన వారికి త్వరలో అందిస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఎపిఎం రాజారాం, జలుమూరు మండల గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు బి.భవానీ తదితరులు పాల్గొన్నారు.