ఆటో, టిప్పర్ ఢీ: ఆరుగురు దుర్మరణం

6

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా జైపూర్ – భీమారం సమీపంలోని మాంతమ్మ ఆలయం ఎదురుగా శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని…. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు చెప్పారు. అలాగే మృతదేహాలను స్వాధీనం చేసుకుని… పోస్ట్మార్టం నిమిత్తం ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఆస్పత్రికి తరలించన మృతదేహాలను గుర్తించారు. ఈ ఘటనలో అదరపల్లికి చెందిన మల్లయ్య, రమేష్, మహేందర్, తోపాటు చెన్నూరుకు చెందిన మధుకర్, నరేష్, మల్లవ్వ మృతిచెందినట్లు పోలీసులు నిర్ధరించారు. ఆటో డ్రైవర్ నాగుల సురేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.