ఆడబిడ్డలకు ఘనంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం

అభివృద్ది – సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
హుజూర్ నగర్ సెప్టెంబర్ 25 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని టౌన్ హాల్ నందు, మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆదివారం ముఖ్య అతిథిగా హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి విచ్చేసి ఆయన చేతుల మీదుగా ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగను అంతర్జాతీయంగా ఖ్యాతి, పేరు ప్రతిష్టలను తెచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దేనని తెలియజేశారు. నేడు అన్ని దేశాలలో తెలంగాణ బతుకమ్మ పండుగను ఫ్లవర్స్ ఫెస్టివల్ గా నిర్వహించుకుంటున్నారు అన్నారు. మన పండుగకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ అని గర్వంగా తెలియజేశారు. ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అందరూ మహిళలు సంతోషంగా పండుగను జరుపుకునేలా ఆడబిడ్డలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా ఆత్మీయతతో నిర్వహిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని అన్నారు. చీరల పంపిణీ అంటే ఆడబిడ్డలకు విలువనివ్వడంతోపాటు సమాజానికి మహిళల ప్రాధాన్యతను చాటి చెప్పడం జరుగుతుంది అని తేలియజేశారు.
నేడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా మొదటి ప్రాధాన్యత లక్ష్యంగా పనిచేస్తుందని సగర్వంగా తెలియజేయడం జరుగుతుంది అన్నారు. సంక్షేమ విషయంలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పథకాలు ప్రతి కుటుంబానికి నిజాయితీగా ముందుండి చేరవేస్తున్నామని, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ ఇలాంటి పథకాలను నిరంతరం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి వివక్ష విచక్షణ చూపకుండా అమలు చేస్తున్నామని తెలియజేశారు. పెన్షన్లు కూడా కొత్తగా 11000 నూతన పెన్షన్లను నియోజకవర్గంలో మంజూరు చేపించామని కొన్ని కారణాల చేత ఆగిపోయినటువంటి పెన్షన్లను కూడా తిరిగి మంజూరు చేపిస్తున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి తట్టుకోలేక ప్రజలలో ఇప్పటికే స్థానం కోల్పోయినటువంటి ప్రతిపక్షాలు కేసుల ద్వారా అభివృద్ధిని అడ్డుకుంటూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని దీనికి ప్రత్యక్ష ఉదాహరణ హుజూర్ నగర్ మెయిన్ రోడ్ అని, ఒక వైపు నాణ్యతతో కూడిన అద్భుతమైన రోడ్డు నిర్మిస్తే ఇంకొక వైపు కేసులు వేయడం చేత రోడ్డు నిర్మాణం వేయలేక గుంతలతో కూడినటువంటి రోడ్డును చూస్తున్నాం అన్నారు. ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురైన వారికి మాత్రం అభివృద్ధి జరగదు అనే ముఖ్య ఉద్దేశంగా కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. రానున్న మూడు నెలల్లో దాదాపుగా అన్ని రకాలైనటువంటి అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు కానుకగా ఇవ్వబోతున్నామని తెలియజేశారు. 2000 కోట్ల రూపాయలతో సాగునీటి లిఫ్ట్ ఇరిగేషన్, హుజూర్నగర్ లో 8.30 కోట్ల రూపాయలతో మినీ ట్యాంకుబండ్ ని ఆహ్లాదకరంగా నిర్మాణం చేపిస్తున్నామని ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత హుజూర్ నగర్ పట్టణంలోని ప్రతి కుటుంబం సంతోషంగా పిల్లాపాపలతో సకుటుంబ సపరివార సమేతంగా ట్యాంకుపండు వద్ద సేద తీరొచ్చునని తెలియజేశారు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని కూడా ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నట్లు తెలియజేయడం జరిగిందన్నారు. ప్రజలందరూ అభివృద్ధిని జరుగుతున్న వారెవరు, అభివృద్ధిని అడ్డుకుంటున్న వారెవరు అనే విషయాల మీద ఖచ్చితంగా అవగాహన పెంచుకోవాలి చర్చలు జరపాలన్నారు. ప్రజలలో అభివృద్ధి చేస్తున్న వారికి ప్రోత్సాహం ఇచ్చి మద్దతు ఇవ్వాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, కౌన్సిలర్లు, వివిధ మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.