ఆడబిడ్డలే కీర్తి చాటారు

5

రియోవిజేతలను అభినందించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ,ఆగస్టు 28(జనంసాక్షి):రియో ఒలింపిక్స్‌ లో పీవీ సింధు, సాక్షి మలిక్‌ పతకాలు సాధించి దేశ కీర్తిని పెంపొందించారని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. మన్‌ కీ బాత్‌ లో భాగంగా మోడీ మాట్లాడుతూ.. పుల్లెల గోపీచంద్‌ తపస్సు చాలా గొప్పది, క్రీడల పట్ల ఆయనకున్న అంకితభావం అమోఘమన్నారు. రియో ఒలింపిక్స్‌ లో దీపా కర్మాకర్‌ చూపిన ప్రతిభను ప్రధాని మెచ్చుకున్నారు. క్రీడలపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలన్నారు. సెప్టెంబర్‌ 5 అనేది టీచర్స్‌ డే మ్రాతమే కాదు, నేర్చుకోవడం కూడా అని తెలిపారు. టీచర్లు పిల్లల భవిష్యత్‌ కోసం కష్టపడాలన్నారు. త్వరలోనే దేశమంతటా గణేష్‌ ఉత్సవాలు జరుపుకోబోతున్నామని గుర్తు చేశారు. పర్యావరణ హితంగా ఉత్సవాల నిర్వహణ సమాజసేవే అవుతుందన్నారు. మట్టి విగ్రహాల తయారీ సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరారు. పర్యావరణం, నదీ పరిసరాలు, జీవుల రక్షణ ఈశ్వర సేవే అవుతుందన్నారు. వినాయక చవితి, దుర్గా నవరాత్రులకు మట్టి విగ్రహాలనే తయారు చేయాలని కోరుతున్నానని చెప్పారు. అటు మదర్‌ థెరిస్సా సేవలను గుర్తు చేసిన మోడీ, వారి స్ఫూర్తితో ముందుకెళ్లాలని సూచించారు.

ప్రధానిని కలిసిన పీవీ సింధు, కోచ్‌ గోపీచంద్‌

ఇవాళ ప్రధాని నరేంద్రమోదీని బ్యాడ్మింటన్‌ స్టార్‌, ఒలింపిక్‌ రజత పతకం విజేత పీవీ సింధు, కోచ్‌ గోపీచంద్‌, రెజ్లర్‌ సాక్షిమాలిక్‌, జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌, షూటర్‌ జీతూరాయ్‌ కలిశారు. ఈ సందర్భంగా రియో ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రతిభను కనబరిచి దేశ ఖ్యాతిని మరోసారి ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన పీవీ సింధు, సాక్షిమాలిక్‌, దీపాకర్మాకర్‌, జీతూరాయ్‌ లను ప్రధాని మోదీ అభినందించారు. ఈ నేపథ్యంలో కేంద్ర కీడ్రాశాఖ మంత్రి విజయ్‌గోయల్‌ ప్రధానితో సమావేశమయ్యారు.