ఆత్మీయానుబంధమే మా ఊరి పండుగ…
తిండిగింజల కోసం వెళ్లిన పిట్టలు, గడ్డిమేత కోసం వెళ్లిన పసులు పొద్దూబుకినాక తొవ్వదారి పట్టినట్లు, మేము కూడా దసరా పండుగకు ఇంటి తొవ్వ పట్టినం. పండగొచ్చిందంటే ఎక్కడలేని సంబరం మాకు. ఏమో ఈత్యాప ఏమైతదో ఏమో. గీ కరోనా బీమారి పాడుగాను గిది వచ్చినంక మాదోస్తుగాళ్ళు దీని బారిన పడి జీవిడిచిండ్రు అసలే దంచికొడుతున్న వానలు సాయంత్రం వచ్చిన సుట్టంలా కరోనారంది ఉండనే ఉండే? ఈసారి పండుగెట్టయితదో ఏమో? అనే ఆలోచనతో గడుపుతున్న మాకు మా వాడకట్టు ముత్యాలమ్మ చల్లని దీవెనలతో మా శివయ్య (శివాలయములోని ఉమామహేశ్వరుడు) ఆశీస్సులతో పండుగ ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి. కొత్త పెండ్లిపిలగాని ఇల్లు సంతరించినట్టుగా మా ఊళ్ళోని వీధిలైట్లు మిరుమిట్లుగొల్పుతున్నాయి. ప్రతి బజారు లక్ష్మణ రేఖల్లాగా సున్నపు బెర్రలతో తళతళలాడుతుంది. అసలు ముచ్చట చెప్పకుండా ఏదేదో సెప్తున్నా మీకు!!
మా ఊరు శెట్టిపాలెం నల్లగొండ జిల్లా, మిర్యాలగూడెం తాలుకా, వేములపల్లి మండలంలో ఉన్న పెద్ద ఊర్లలో మాది ఒకటి. ఆదర్శ గ్రామంగా ప్రభుత్వం గుర్తించింది. మా మండలానికి పెద్దన్నలాగా ఉంటది మా ఊరు. చుట్టు పంటపొలాలు. వేణుగోపాలస్వామి గుట్ట శెట్టిపాలెం చెరువు, బతుకు దెరువు తీర్చడానికీ రైస్‌మిల్లులు, పెద్ద కాలువ (నాగార్జునసాగర్ ఎడమ కాలువ) మేరిమాత గుడి, చిత్రపరకవాగు వేములపల్లి చెరువు నిండిమత్తడి దుంకితే పారే అలుగు ఇట్లా చెప్పుకుంటూ పోతే రోజులు పడతాయి. యాదగిరిపల్లి చెరువు దాకా మా పొలాలే.. ఏడుకోటలతండా నుండి పచ్చారిగడ్డ దాకా ఇటు ఊట్లపల్లి ఒంపుల నుండి జగ్గుబాయితండా దాక మా ఊరి పంటపొలాలే అదొక సిత్రం! చూడాల్సిందే మా పల్లె, మాల బావి నుండి, ముత్యాలమ్మ బావి, గోవిందొనిబాయి, ఈదులబాయి మా చిన్నప్పటి ఈత నేర్చుకున్న బావులు.
అంబము నుండి అమెరికా దాకా యాడున్నోళ్లంతా దసరా పండగ మా ఊరితొవ్వ పడతారు. ఇది మా ఊరి పండగ జాతర్ల తప్పిపోయినోళ్ళంత కల్సుకున్నట్లు మేం కూడా గీ పండక్కు కల్సుకుంటాం. గందుకే ఇది మా ప్రాణ. (పండగ)
పొద్దుగాల లేచి తానం జేసి దేవునికి దండంపెట్టి అమ్మ పనిచేస్తుంటే సాయం చేస్తూ సాంబువ్వ (స్వామిబువ్వ – శనిగపులగం) వండుతుంటే బెల్లం పానకం చేసుకుంటూ ఉంటాం. పొద్దుగాల నాస్తా చేసి, పొయ్యి ముందు కూసొని చిన్నమ్మ అమ్మ అప్పలు జేస్తుంటే కారపూస వొత్తుకుంటూ, పకోడీలకు ఉల్లిగడ్డలు కోసి అందించినాక మధ్యాహ్నం బువ్వ ( సాంబువ్వ – దేవునికి నైవేద్యం పెట్టినంక) తిని సాయంత్రం నాలుగు ఎప్పుడైతదా అని ఎదురుచూస్తుంటాం.
సాయంత్రం నాలుగు కాగానే చీమలు బారు కదిలినట్లు వానరమూక లంకతొవ్వ పట్టినట్లు మేము నడూళ్ళకి పోతం. ఇగో ఇక్కడ ఉంది మా ఊరి కథ. సచివాలయం దగ్గర వేపచెట్టుకు ఎదురుగా చిన్నగుడి, ఆ గుడి దగ్గర ఇసుకపోస్తే రాలనంత జనం ఊరంతా ఊపిరి చిగపట్టి ఎదురు చూస్తం. ఆ క్షణం కోసం అప్పుడే గ్రామసర్పంచ్ ఎం.పి.టి.సి, జెడ్.పి.టి.సి ఊళ్ళో పెద్ద మనుషులు అంతా కలిసి డప్పుసప్పులతో ఊరేగించుకుంటూ యాటపోతుని తోలకొస్తరు. నవరాత్రులలో ఉపవాసం చేసి, అకుంఠిత దీక్షతో చేతిల తళ్వారుతో పూనకం వచ్చిన వీరభద్రుడిలా బంటు తిరుమలేష్/ బంటు శ్రీను ఆ గుడి కాడిక వచ్చినంక మా ప్రాణాలు బిగపట్టి సూస్తుంటాం. ఊరిని కాపాడమని అమ్మని తల్సుకుంటూ చేతులెత్తి అమ్మకు జై కొడుతుండగా ఆ క్షణంలో ఉగ్రనరసింహుడిలా ఒకే వేటుకు యాట పోతును నరికి అమ్మకి బలిస్తాడు. ఆ బలి కార్యక్రమం అయినంక అందరం ఏ అరిష్టం రాకుండా కాపాడినందుకు అమ్మని తల్సుకుంటూ పెద్దబడితొవ్వ పడతం. పెద్ద బడిలో జమ్మి (బంగారం) కోసం మా పరుగులు, ఆడికి పోగానే మాదోస్తుగాళ్ళు శమీశమయతే అమ్మవారి కరపత్రం చేతిలో పెట్టగానే దాన్ని కళ్ళకద్దుకొని ఇంటొళ్ళందరి పేర్లు రాసి, బంగారం తెంచుకొని, దొస్తుగాళ్ళందరికీ అలయ్ బలయ్ ఇచ్చుకుంటూ రావణ దహన కార్యక్రమం చేసి, పాలపిట్టను జూసి ఇంటిదారి పడ్తం.
ఇగ ఇంటికొచ్చినంక దీపాలు పెట్టి లక్ష్మిబాంబు, థౌసెండ్‌వాలా, అమ్మవాళ్ళు కాల్చడానికి కాకరపూలు, చిచ్చుబుడ్లు, చిన్నపొరగాళ్ళకీ భూచక్రాలు, మిరపకాయబాంబులు, ఇంటి ముందు రాకెట్లు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం బాంబులు పేల్చుకుంటూ ధూంధాం చేస్తాం. బాంబులన్ని అయిపోయినంక గింతబువ్వతిని పండుకుంటాం. పొద్దుగాల లేచి మిగిలిన బాంబుల్ని కాల్చుకుంటాం. ఉన్న ఊరు కన్నతల్లి లాంటిదన్నట్లు ఏ దేశంలో ఉన్నా దసరా పండక్కి అందరం కల్సుకుంటాం. ముచ్చట్లు చెప్పుకుంటాం. జ్ఞాపకాల అలల్ని మూటగట్టుకొని, అప్పలు, చెట్నీలు గట్టుకొని మళ్ళీ బతుకుతొవ్వ పడతాం. మళ్ళీ వచ్చే దసరా పండక్కి ఊళ్ళో కల్సుకుంటాం అనే ఆశతో….
– డా. కందుల శివకృష్ణ
పిజిటి తెలుగు, టిఎస్ మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాల
అంబం, రుద్రూరు, నిజామాబాద్ జిల్లా
9966507875