ఆదర్శ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి

ర్యాలీగా డిఇవోకు వినతిపత్రం సమర్పణ

నిజామాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): ఆదర్శ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని టీఎంటీఏటీఎస్‌ జిల్లాధ్యక్షుడు పి.చంద్రశేఖర్‌ డిమాండు చేశారు. గురువారం పీఆర్‌టీయూటీఎస్‌ సహకారంతో జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్‌ నుంచి ర్యాలీగా వెళ్లి డీఈఓకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్‌లో నిరసన తెలిపి, అక్కడ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో కాలయాపన చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఏకీకృత సర్వీసు రూల్స్‌ వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. బదిలీలను వెంటనే చేపట్టాలని, హెల్త్‌ కార్డులను అందించాలని సూచించారు. రెండోదశలో చేరిన ఉపాధ్యాయుల నోషనల్‌ సర్వీసు, నోషనల్‌ ఇంక్రిమెంటును కల్పించాలని తెలిపారు. పీజీటీలకు జూనియర్‌ అధ్యాపకుల స్థాయి వేతనాలను అందించాలని డిమాండ్‌ చేశారు. పనిభారం తగ్గించడానికి అదనంగా టీజీటీలను నియమించాలన్నారు. వసతిగృహాలకు ప్రత్యేక మహిళా వా/-డ్గం/న్లను నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఎఫ్‌ఏసీ ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక అలవెన్సు అందించాలన్నారు. కార్యక్రమంలో టీఎంటీఏటీఎస్‌ రాష్ట్ర, జిల్లా బాధ్యులు బి.శ్రీనివాసరాజు, బి. నాగేశ్వర్‌రావు, టి.శ్రీకాంత్‌, కె. రాఘవేందర్‌, పీఆర్‌టీయూటీఎస్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఇల్తెపు శంకర్‌, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.