ఆదాయ పన్ను స్లాబ్ లు యథాతథం

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను స్లాబుల్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎలాంటి మార్పులు చేయలేదు. వాటిని యథాతథంగా ఉంచారు. అయితే, పన్నుల నుంచి మినహాయింపు ఇచ్చే అంశాల్లో ఊరట కల్పించారు. మెడికల్ ఇన్సూరెన్స్ రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. సీనియర్ సిటిజన్లకు ఇది రూ. 20 వేల నుంచి రూ. 30 వేలకు పెంచారు. ఇన్సూరెన్స్ పరిధిలోకి రాని 80 ఏళ్లు దాటిన వృద్ధులకు రూ. 30 వేల వరకు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. తీవ్ర జబ్బులకు వైద్యం చేయించుకుంటే ఇచ్చే మినహాయింపుని రూ.60 వేల నుంచి రూ.80 వేలకు పెంచారు. పెన్షన్ ఫండ్ కు చెల్లింపులకు మినహాయింపులను రూ. లక్ష నుంచి లక్షన్నరకు పెంచారు. ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ ని నెలకు రూ. 800 నుంచి రూ. 1600 వరకు పెంచారు.
వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు గరిష్టంగా రూ.4.44 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందుతారని వెల్లడించారు. ఆదాయపు పన్నుపై ఇప్పటికే ఉన్న రెండు శాతం ఎడ్యుకేషన్ సెస్ కు అదనంగా ఇంకా ఒక్క శాతం సెకండరీ, హయ్యర్ ఎడ్యుకేషన్ సెస్ ని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.రూ.లక్ష దాటిన అన్ని ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి చేశారు. వార్షిక ఆదాయం రూ. కోటి దాటితే 2 శాతం సూపర్ రిచ్ పన్ను వేయనున్నారు.
సంపద పన్నుని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.