ఆదా తక్కువ- ఖర్చు ఎక్కువ.

ఖాళీ కుర్చీ లకు ఫ్యాన్లు,ఏసీలు.
విద్యుత్ శాఖలో అధికారుల నిర్లక్ష్యం. తొలగించిన విద్యుత్ కనెక్షన్లు.
అవస్తల్లో ప్రజలు.
జిల్లా విద్యుత్ కార్యాలయంలో యదేచ్చగా దుర్వినియోగం.
ఇలా చేస్తే ప్రభుత్వ సంస్థలు లాభాల్లోకి ఎలా వస్తాయి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు5(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లాలో విద్యుత్తు శాఖ అధికారులు వినియోగదారుల నుండి బిల్లులు వసూళ్లు చేస్తున్నా తీరు చూస్తే హాస్యాస్పదంగా ఉంది.ప్రతిరోజు 5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం అవుతుంది.అయితే సరఫరా మాత్రం 4 మిలియన్ యూనిట్లకు మించడం లేదు. ప్రైవేట్ వ్యాపారస్తులు వినియోగదారులు వేలాదిమంది విద్యుత్ కనెక్షన్ ప్రభుత్వానికి సమాచారం లేకుండానే తీసుకుంటున్నారు. విద్యుత్ అక్రమంగా వినియోగం కావడం వల్ల ఈ బిల్లులు చెల్లించే వారికి నాణ్యమైన విద్యుత్ సరఫరా కావడం లేదు.ముఖ్యంగా ఉచిత విద్యుత్తు 24 గంటలు అందిస్తా మంటున్న ప్రభుత్వం రోజుకు 12 గంటలైనా సరఫరా ఇవ్వడం లేదు. దీంతో రైతులు, పరిశ్రమలు,వ్యాపార సంస్థలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల అధికారులు విద్యుత్ శాఖకు చెల్లించవల సిన బిల్లులను చెల్లించడంలో నిర్లక్ష్యం చేయడం ఫలితంగా విద్యుత్ శాఖ అధికారులు గత కొద్ది రోజుల క్రితం ఆయా కార్యాలయాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ఆ కార్యాలయాలకు వచ్చే ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు.జిల్లా కేంద్రంలో ప్రతినిత్యం ఎంతో రద్దీగా ఉండే సబ్ రిజిస్టర్ కార్యాలయం తో పాటు ఆర్టీవో కార్యాలయం నేడు బోసిపోయింది.ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ శాఖ అధికారులు బిల్లులు చెల్లించాలని అనేక పర్యాయాలు మొరపెట్టుకున్న వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల కార్యాలయాలు చెల్లించవలసిన బిల్లులు పేరుకుపోవడంతో గత్యంతరం లేక విద్యుత్ అధికారులు గత కొద్దిరోజులు క్రితం ఆయా కార్యాలయాలకు విద్యుత్ కనెక్షన్లను తొలగించారు. దీంతో కార్యాలయాలలో పనిచేసే సిబ్బంది విద్యుత్ సమస్యతో సతమతమవుతు న్నారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే శాఖలలో ప్రధాన కీలకమైన సబ్ రిజిస్టర్ మరియు ఆర్టీవో కార్యాలయాలే బిల్లులు చెల్లించలేని దుస్థితిలోకి వెళ్లడం దారుణం.సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ప్రతినిత్యం వందలాది మంది రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు.కానీ విద్యుత్ కొరతతో అక్కడ పనిచేసే సిబ్బంది సర్వర్ ప్రాబ్లం పేరుతో పని చేయకపోవడం వల్ల నిత్యం కార్యాలయానికి తిరుగవలసిన పరిస్థితి దాపురించిందని వినియోగదారులు వాపోతున్నారు.కార్యాలయంలో ఉండే బ్యాటరీల సహకారంతో కార్యాలయంలో కొంత మేర పనులు చేస్తున్నప్పటికీ ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. సంబంధిత అధికారులకు వివరణ కోరగా ఉన్నతాధికారులకు బిల్లుల కోసం నివేదికలు పంపడం జరిగిందని వచ్చిన వెంటనే చెల్లిస్తామని పేర్కొంటున్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో మరో కీలక శాఖ అయిన ఆర్టీవో కార్యాలయానికి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుండి ప్రజలు వాహనాల రిజిస్ట్రేషన్ మరియు వాహనాలు నడిపేందుకు లైసెన్స్ పొందేందుకు వందల సంఖ్యలో ఇక్కడికి చేరుకోవడంతో ఈ ప్రాంతం ఎప్పుడు సందడిగా ఉండేది కానీ విద్యుత్ కొరత కారణంతో పనులు నిలిచిపోవడంతో కార్యాలయం బోసిపోయింది.ఇక్కడ కూడా ఉన్న బ్యాటరీల సహకారంతో కొంత పని చేస్తున్నా ప్రజలకు సేవలు అందడం లేదు. విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించగా ముందస్తుగానే ఆయా శాఖలకు సమాచారం అందించామని వారికి కూడా ముందుగా టోకన్స్ తీసుకునే అవకాశం ఉన్న నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వివరించారు.ప్రస్తుతం అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కార్యాలయా లకు మాత్రం విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని అన్ని శాఖలు కూడా ముందుగా టోకన్స్ తీసుకొని తమ శాఖకు చెల్లించవలసిన బిల్లులను చెల్లించాలని కోరుతున్నారు…..

విద్యుత్ శాఖలో విద్యుత్ దుర్వినియోగం:
విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు విద్యుత్ ను పొదుపుగా వాడుకోవాలని సూచిస్తున్న వారి కార్యాలయంలోనే విద్యుత్ దుర్వినియోగం చేయడం విడ్డూరంగా ఉంది.విద్యుత్ ఎస్ ఈ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది విద్యుత్ ఆదా చేయడంలో నిర్లక్ష్యం చేస్తూ భోజన సమయంలో సుమారు గంటకు పైగా కార్యాలయంలో ఫ్యానులు మరియు విద్యుత్ దీపాలను మరియు ఏసీ లను యధావిధిగా ఆన్ లో ఉంచి వెళ్లడంతో అక్కడికి వచ్చిన పలువురు కార్యాలయంలో ని ఖాళీ కుర్చీలకు, టేబుల్స్ కు ఫ్యాన్లు,ఏసీలు వదిలేశారని అక్కడికి వచ్చిన పలువురు ముక్కున వేలేసుకున్నారు.విద్యుత్ దుర్వినియోగంపై పలు రకాలుగా చర్చించుకున్నారు. ఒకవైపు పొదుపు పేరుతో అధికారులు ప్రకటనలు చేస్తూ మరోవైపు విచ్చలవిడిగా విద్యుత్ వినియోగం చేస్తున్నారు.

బిల్లును పేరుకుపోవడం వల్లే కనెక్షన్లు తొలగించాం.
లీలావతి ఎస్ ఇ నాగర్ కర్నూల్.:
జిల్లాలో వినియోగదారులు విద్యుత్ బిల్లులను చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు.అందువల్లే కొన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన విద్యుత్ కనెక్షన్లు తొలగించారు.ముఖ్యంగా వైద్య విద్య రంగాల కు చెందిన ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్తును తొలగించడం లేదు. ఫైర్ స్టేషన్లకు సైతం విద్యుత్తు కనెక్షన్లు తొలగించడం లేదు. విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించి వినియోగదారులు సహకరించాలి. నాయనమైన విద్యుత్తును వినియోగదాలకు అందించాలంటే సక్రమంగా బిల్లులు చెల్లించడమే ప్రధాన మార్గం.