ఆధార్‌ వల్ల అవినీతి అంతం

అసలు లబ్ధిదారులకే ప్రభుత్వ పథకాలు
నగదు బదిలీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన జైరాం రమేశ్‌
గొల్లప్రోలు (తూర్పుగోదావరిజిల్లా), జనవరి 06 (జనంసాక్షి):
నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించడం హర్షదాయ కమని కేంద్ర గ్రామీణ శాఖమంత్రి జైరాంరమేష్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో ఆదివారం మధ్యాహ్నం నగదు బదిలీ పథకాన్ని కేంద్ర మంత్రి జైరాంరమేష్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. సత్యనారాయణ అనే వ్యక్తికి పెన్షన్‌ను, విద్యార్థికి నగదును అందజేసి పథకాన్ని ప్రారంభింప జేశారు. ఈ సందర్భంగా తొలుత కేంద్ర మంత్రి జైరాంరమేష్‌ మాట్లాడుతూ గొల్లప్రోలులో నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ గ్రామంలో పథకం ప్రారంభం కావడం జిల్లా వాసుల అదృష్టమన్నారు. అన్ని జిల్లాల్లో ఈ ఏడాది ఆగస్టు నాటికి నగదు బదిలీ పథకంఅమలవుతుందన్నారు. ఆధార్‌తో కూడిన నగదు బదిలీ పథకం వల్ల దళారీ వ్యవస్థ భూ స్థాపితమవుతుందన్నారు. మీ డబ్బు.. మీ చేతికే నేరుగా వస్తుందన్నారు. బ్యాంకులకు, పోస్టాఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. మైక్రో ఎటిఎం ద్వారా మీ ఇంటికే.. మీ చెంతకే డబ్బు వస్తుందన్నారు. దీని వల్ల అవినీతి, నకిలీ వ్యవస్థ కనుమరుగవుతుందన్నారు. అంగన్‌వాడీ వర్కర్లు, స్వయంశక్తి గ్రూపుల మహిళలు, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు తమ నివాసం వద్దే ఉండి మైక్రో ఎటిఎం ద్వారా డబ్బు అందుకోవచ్చన్నారు. 2013, ఆగస్టు నాటికి అన్ని గ్రామాల్లోను మైక్రో ఎటిఎం ద్వారా నగదు అందుతుందన్నారు. వీటిని నిర్వహించే వారికి ప్రత్యేకంగా కమిషన్‌ ఇవ్వనున్నట్టు తెలిపారు. మన రాష్ట్రంలోని స్వయంశక్తి గ్రూపు మహిళల పనితీరు, వారు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల ద్వారా లబ్ది పొందడం, పొదుపు చేయడం,బ్యాంకులకు సకాలంలో చెల్లిస్తున్న తీరు ఇతర రాష్ట్రాలకు పాకిందన్నారు. జార్ఖండ్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల వారి విజ్ఞప్తి మేరకు మనవాళ్లు అక్కడికి వెళ్లి అక్కడి వారికి శిక్షణ ఇస్తున్న ఖ్యాతి మన రాష్ట్ర మహిళలకు దక్కడం మన అదృష్టమన్నారు. నగదు బదిలీ పథకం వల్ల మేలెంతో ఉందని చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఇదొక గొప్ప సుదినమన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రజలు చాలా అదృష్ట వంతులన్నారు. ఒక రూపాయికి కిలో బియ్యం పథకాన్ని జగ్గంపేట నియోజకవర్గంలో ప్రారంభించాం. ఇందిరమ్మబాటను కూడా ఇదే జిల్లాలో ప్రారంభించాం.. నేడు నగదు బదిలీ పథకాన్ని ఇదే జిల్లాలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. నగదు బదిలీ పథకం ప్రారంభం వల్ల తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు గ్రామం పేరు దేశ స్థాయికి ఎదిగిందన్నారు. ఆధార్‌ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయన్నారు. ఆధార్‌ కార్డు ఒక వ్యక్తికి ఒకటే వస్తుందన్నారు. ఆ నంబరు మరొకరికి రాదన్నారు. అవినీతి, నకిలీ వ్యవస్థ పూర్తిగా సమసిపోతుందన్నారు. ఎవరు.. ఎవర్ని మోసం చేయలేరన్నారు. అంతేగాక ఆధార్‌ నంబరు వల్ల దేశంలో ఎక్కడ ఉన్నా.. అక్కడ రేషన్‌ పొందొచ్చన్నారు. కాకినాడలో ఉండే వ్యక్తి రాజమండ్రికి వస్తే అక్కడ రేషన్‌ స్వీకరించవచ్చన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 15 లక్షల రేషన్‌ కార్డులున్నాయి. అయితే జిల్లాలో 12,50,000 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. కుటుంబాలు విడిపోవడం వల్ల, ఒక ప్రాంతంలోని వారు మరో ప్రాంతానికి మారడం వల్ల ఆ వ్యత్యాసం వచ్చిందన్నారు. ఆధార్‌ వల్ల అటువంటివి జరగబోవన్నారు. మన రాష్ట్ర జనాభా 8,46,00,000 అయితే 5 కోట్ల మంది ఆధార్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. ఆధార్‌ నమోదు ప్రక్రియను తొలుత అయిదారు జిల్లాల్లో చేపట్టామని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోం దన్నారు. నగదు బదిలీ పథకం వల్ల రేషన్‌ దుకాణాలు కనుమరుగవుతాయని ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయన్నారు. అందులో ఎటువంటి వాస్తవం లేదన్నారు. రేషన్‌ దుకాణాల ద్వారా త్వరలో మరో అయిదు నిత్యావసర వస్తువులతో కలిపి చౌక ధరలకు అందించనున్నామన్నారు. చింతపండు, పసుపు, మిరపపొడి, ఉప్పు, తదితరమైనవి ఇవ్వనున్నట్టు చెప్పారు. నగదు బదిలీ ద్వారా అందరికీ మేలు జరుగుతుంద న్నారు. 26 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు, రియంబర్స్‌మెంటు ఫీజు, తదితరమైనవి నేరుగా అందుతాయన్నారు. ఎవరి చుట్టూ తిరగాల్సిన పనిలేదన్నారు. మైనారిటీ, ఎస్‌సి, ఎస్‌టి, బీసీ, ఇబీసీ, ఇలా అందరు విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు అందజేస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు. నీలం తర్వాత నుంచి రైతుకు ఇన్‌పుట్‌ సబ్సిడి కింద హెక్టారుకు 10వేల రూపాయలు అందజేస్తున్నామన్నారు. అంతకుముందు 6వేలు రూపాయలుండేదన్నారు. చంద్రబాబు హయాంలో రైతులకు 12 నుంచి 14శాతం వడ్డీకి రుణాలు ఇచ్చేవారన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం అసలు చెల్లించండి.. వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందని చెబుతున్నామన్నారు.రైతులు తీసుకున్న రుణంపై 4శాతం వడ్డీ కట్టాల్సి ఉంటుం దన్నారు. ఆ నాలుగు శాతాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తోందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వంగా గీత చాలా తెలివయినవారు. పిఠాపురం అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. ఆమె ఏదడిగినా ప్రజల గురించే.. అటువంటి ఎమ్మెల్యే దొరకడం పిఠాపురం నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు. పిఠాపురం అభివృద్ధికి, గొల్లప్రోలు అభివృద్ధికి సహకరిస్తామన్నారు. అలాగే వంతెనల, రోడ్ల మరమ్మతులకు కూడా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇస్తున్నానని అన్నారు. ఇదిలా ఉండగా బహిరంగసభలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, బాలరాజు, తోట నర్సింహం, డొక్కా మాణిక్యవరప్రసాద్‌, ఎంపిలు అరుణకుమార్‌, హర్షకుమార్‌, రాజమండ్రి ఎమ్మెల్యేలు దుగ్గేష్‌, వంగా గీత, ఎమ్మెల్సీలు, కలెక్టరు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.