ఆనాటి అవినతీ భోక్తలు మాట్లాడుతున్నారు: అయ్యన్న

విశాఖపట్టణం, జూన్‌27(జ‌నం సాక్షి): వోక్స్‌ వ్యాగన్‌ వ్యవహారంలో రాష్ట్ర పరువు తీసిన మాజీమంత్రి, వైకాపా నేత బొత్స సత్యనారాయణ,మేదోమథనంలో కోట్లు బొక్కిన పిసిసి చీఫ్‌ రఘువీరారెడ్డిలు అవినీతి గురించి మాట్లాడుతున్నారని రహదార్లు, భవనాల మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. ఆనాటి అవినీతి గురించి వీరు ముందు మాట్లాడాలన్నారు. వైఎస్‌ హయాంలో అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు.దొంగలకు అవినీతి గురించి మాట్లాడే హక్కులేదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి చూడలేక వైసీపీ నేతలు ,కాం/-గరెస్‌ నేతలు లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో ఒక్కరికి కూడా పింఛన్‌ ఇవ్వడం లేదన్న బొత్సపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ అనుభవముండి.. మంత్రిగా పనిచేసిన ఆయన ఈ విధంగా మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వోక్స్‌వ్యాగన్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు కావలసి ఉండగా.. బొత్స లంచాలు అడగడంతో అది వేరే రాష్టాన్రికి తరలిపోయిందని అన్నారు. దోచుకుని 16నెలలు జైలులో ఉన్న జగన్‌కు అవినీతిపై మాట్లాడే అర్హతేలేదన్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు దొంగలంతా కలిసి ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.