ఆన్‌లైన్‌ దారుణ మోసగాళ్ల పట్టివేత

– 11 మంది అరెస్ట్‌

– హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌

హైదరాబాద్‌, డిసెంబరు 22 (జనంసాక్షి):దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆన్‌ లైన్‌ రుణాల కేసులో తీగలాగితే డొంక కదులుతోంది. వందల కంపెనీలు నిబంధనలకు విరుద్దగంగా ఆన్‌ లైన్‌ రుణాల పేరుతో భారీగా వడ్డీ వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాల్లో బాధితుల సంఖ్య వేలల్లో ఉండటంతో పోలీసులు ప్రధాన దృష్టి సారించారు.ఇప్పటివరకు ఆన్‌లైన్‌ రుణాలకు సంబంధించి నమోదైన కేసుల్లో 11 మందిని అరెస్ట్‌ చేసినట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. నాలుగు కంపెనీలు 11 వందల మందిని నియమించుకుని కోట్లలో అక్రమ వ్యాపారం చేస్తూ దేశవ్యాప్తంగా వేలాదిమందిని మోసం చేస్తున్నాయన్నారు. ఆన్‌లైన్‌ రుణాల వ్యవహారంలో ఇప్పటివరకు 16 కేసులు నమోదయ్యాయని. కేసుకు సంబంధించి హైదరాబాద్‌, గురుగ్రామ్‌లో దాడులు చేపట్టినట్లు చెప్పారు. గురుగ్రామ్‌కు చెందిన ఐదుగురు, హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. లియుఫాంగ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌, హాట్‌ఫుల్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పిన్‌పాయింట్‌ టెక్నాలజీ, నాబ్లూమ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలు ఆన్‌లైన్‌ లోన్‌ పేరుతో బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని చెప్పారు అంజనీ కుమార్‌.