ఆఫ్గనిస్తాన్‌లో దాడిని ఖండించిన ప్రధాని మోదీ

– ఆఫ్గనిస్తాన్‌కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి
న్యూఢిల్లీ, జులై2(జ‌నం సాక్షి) : ఆఫ్ఘనిస్తాన్‌లోని జలాలాబాద్‌లో 11సిక్కులు సహా 19 మందిని బలిగొన్న ఆత్మాహుతి దాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌కు తమవంతు సాయం అందించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమని ఆయన ప్రకటించారు. ట్విటర్‌ వేదికగా ప్రధాని మోదీ స్పందిస్తూ…. ఆప్ఘనిస్తాన్‌లో నిన్న జరిగిన ఉగ్రదాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్‌ బహుళ సాంస్కృతిక నిర్మాణంపైనే వారు దాడిచేశారు. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ విషాద సమయంలో ఆప్ఘనిస్తాన్‌కు సాయం అందించేందుకు భారత్‌ సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సంగర్హార్‌ ప్రావిన్స్‌లోని జలాలాబాద్‌లో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడి కారణంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఆప్ఘనిస్తాన్‌లో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన సిక్కు నేత అవతార్‌ సింగ్‌ ఖల్సా కూడా మరణించిన వారిలో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో హిందూ, సిక్కు మతాలకు రిజర్వ్‌ చేసిన ఒకే ఒక్క సీటు నుంచి పోటీ చేసేందుకు ఆయన సిద్ధమౌతున్న తరుణంలోనే ఈ ఘోరం చోటుచేసుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఈ ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు ఆమె సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులను కలుస్తానని ట్వీట్‌ చేశారు.