ఆయుర్వేదం ఉపయోగించుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8 :  ఆయుర్వేద వైద్యాన్ని ఉపయోగించుకుని ఆయురారోగ్యాలతో ప్రజలు ఉండాలని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. నగరంలోని నాందేవ్‌వాడ శాంతి కేరళీయ ఆయుర్వేద హాస్పిటల్‌, దివంగత విజయలక్ష్మీ స్మారకార్థాన్ని పురస్కరించుకొని శనివారం ఉచిత ఆయుర్వేద మందులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైద్యం నాలుగు రకాలని, ఆయుర్వేదం,అల్లోపతి, హోమియోపతి, యునాని అని అన్నారు. అల్లోపతి అంటే ఇంగ్లీష్‌ మందులని, ఇవి రోగాన్ని తొందరగా నయం చేస్తాయన్నారు. ఇంగ్లీష్‌ మందుల్లో ఉన్నట్లు ఆయుర్వేదంలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవని, ఇవి వాడితే శాశ్వత పరిష్కారం ఉంటుందన్నారు. ఒకప్పుడు ఆయుర్వేదం చేయించుకోవాలంటే కేరళకి వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడా ఆయుర్వేద వైద్యం నిజామాబాద్‌లో కూడా అందుబాటులోకి వచ్చిందన్నారు. నగరంలోని నాందేవ్‌వాడలో 49 సంవత్సరాలుగా డా.గంగాధర్‌, రోగులకు ఆయుర్వేద వైద్య సేవలందిస్తున్నారని అన్నారు. ఆయుర్వేద మందులు వాడి, రోగాలను దరి రాకుండా చూసుకోవాలని ప్రజలను ఆయన కోరారు. ఈ క్యాంప్‌లో సుమారు 600 మంది రోగులు ఉచిత మందులు పొందినట్లు డా. విజయభాస్కర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేదారేశ్వరా ఆలయానికి చెందిన శ్రీశ్రీశ్రీ మంగి రాములు మహరాజ్‌, కృష్ణమహరాజ్‌, బ్రహ్మకుమారీ ట్రస్ట్‌ మాతాజీ, డా.గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు