ఆరవ విడత భూ పంపిణీ
కరీంనగర్, నవంబర్ 9 ఆరవ విడత భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలో గంగాధర, మల్యాల, కొడిమ్యాల మండలాలకు చెందిన 53మంది లబ్దిదారులకు భూ పంపిణీ పత్రాలను శుక్రవారం చొప్పదండి శాసనసభ్యులు సుద్దాల దేవయ్య పంపిణీ చేశారు. కరీంనగర్ ఎం.పి.డి.ఓ. కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన లబ్దిదారులకు భూపట్టా, రుణ హామీ పత్రాలను అందజేశారు. గంగాధర మండలంలోని 8మందికి 4ఎకరాలు, మల్యాల మండలంలోని 13మందికి 7.13 ఎకరాలు, కొడిమ్యాల మండలంలోని 32మంది లబ్దిదారులకు 40.09 ఎకరాలు కలిపి 51.25 ఎకరాలు భూపంపిణీ చేశారు. లబ్దిదారులకు బ్యాంకుల ద్వారా రుణం మంజూరు చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, లబ్దిదారుల భూములను ఇందిర జలప్రభ కార్యక్రమం కింద సాగుయోగ్యం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి చెందాలని ఆయన అన్నారు.