ఆరుతడి పంటలకు మాత్రమే నీటివిడుదల

గుంటూరు,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) ): సాగర్‌ కుడి ప్రధాన కాలువకు మార్చి 15 వరకు సాగర్‌ జలాలు విడుదల చేయనున్నట్లు ఇంజనీర్లు  వెల్లడించారు.  జిల్లాలో ఆరుతడి పంటలకు మాత్రమే రెండు విడతలుగా నీళ్లు ఇస్తామన్నారు. సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి 15 టీఎంసీల నీరు మాత్రమే వినియోగానికి ఉందన్నారు. ఈ నేపథ్యంలో మార్చి 15వ తేదీ లోగా చెరువులు, కుంటలు నింపుకోవాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులకు సమాచారం ఇస్తున్నామన్నారు.వినుకొండ నియోజకవర్గంలో 40 వేల ఎకరాల్లో ఉన్న వరిసాగుకు నీటి సరఫరా ఉంటుందని చెప్పారు. విద్యుత్తు ప్లాంట్ల యాజమాన్యాలు కూడా నీరు నిల్వ ఉంచుకోకుండా తక్షణం కిందకు వదలాలని ఆదేశించామన్నారు. రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్‌ అధికారులంతా కలిపి నీరు దుర్వినియోగం కాకుండా పరిశీలన చేస్తారన్నారు. దీనికి రైతులు సహకారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం 532.00 అడుగులకు చేరింది. ఇది 72.07 టీఎంసీలకు సమానం. కుడి కాలువకు 7103, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు 1500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సాగర్‌ జలాశయం నుంచి మొత్తం 8603 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌ జలాశయానికి 4004 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 836.90 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇది 57.07 టీఎంసీలకు సమానం.