ఆరోగ్య సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలి
బాన్స్ వాడ డిప్యూటి డిఎంహెచ్ఓ మోహన్ బాబు
జుక్కల్, జూలై 28,జనంసాక్షి,
ఆరోగ్య సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని బాన్స్ వాడ డిప్యూటి మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మోహన్ బాబు అన్నారు.ఆయన గురువారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. మారుమూల ప్రాంతాలలో పనిచేసే ఆరోగ్యసిబ్బంది ప్రజలకు దగ్గరుండి సేవలందించాలని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు అధికంగా కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు.వ్యాధులు రాకుండా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు వివరించాలని తెలిపారు. వ్యాధులు సోకిన వారికి తగిన చికిత్సలు అందించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే సాధారణ కాన్పులు జరిగేవిదంగా చూడాలని తెలిపారు.స్త్రీలకు గర్భందాల్చినప్పటినుండి కాన్పు అయ్యేవరకు ఆశావర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు నెలనెలా ఆరోగ్య పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయించాలని తెలిపారు. గర్భిణీ ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఎప్పటికప్పుడు వివరిస్తూఉండాలని తెలిపారు.కాన్పు అయినతరువాత మాతాశిశు సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ బూస్టర్ డోస్ ను ప్రజలందరుతీసుకునే విదంగా చూడాలన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు,తాత్కాలిక కుటుంబ నియంత్రణ, ఆరోగ్య శ్రీ, తెలిమెడిసిన్, టిబి, చికెన్ గున్యా, మలేరియా, పై లేరియా, డెంగ్యూ మొదలగు అంశాలపైన సమీక్ష సమావేశంలో లోతుగా చర్చించారు.ఆరోగ్య ఉపకేంద్రాల వారిగా వరుసగా అందరు ఆరోగ్య కార్యకర్తలతో ఆయన చర్చించారు. ఈ కార్యక్రమంలో
మెడికల్ ఆఫీసర్ ప్రశాంత్ ,డివిజన్ సిబ్బంది నీలా నాయక్, దస్థిరాం, మారుతి, వైద్యసిబ్బంది డాక్టర్ మమత, డాక్టర్ విక్రమ్,ఆసుపత్రి సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.