ఆరోపణలు లేకుండా ఆరేళ్ళు పూర్తి చేసుకున్న టీఎస్‌ పిఎస్‌ సి

– టెక్నాలజీని నిరుద్యోగ అభ్యర్థులకు అనుకూలంగా మలిచిన తొలి చైర్మన్‌ ప్రొ. ఘంటా చక్రపాణి

– ఒకప్పుడు అక్రమాలకు నిలయమైన రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నేడు నిష్పక్షపాతానికి నిదర్శనం

– దేశవ్యాప్తంగా 27 పీఎస్సీలు ఉండగా టీఎస్‌ పిఎస్సి పని విధానాన్ని అధ్యయనం చేసిన 12 పీఎస్సీలు

హైదరాబాద్‌ (జనంసాక్షి) : నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన నినాదంగా పోరాడి సాధించుకున్న తెలంగాణలో ‘తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ తొలి చైర్మన్‌ గా ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి తనదైన ముద్ర వేసుకోవడంలో సఫలీకృతులయ్యారు. ఉద్యోగ నియామకాలలో అవినీతి, అక్రమాలకు అవకాశం లేకుండా టీఎస్‌ పిఎస్సీ కార్యకలాపాలు కొనసాగాలంటే చైర్మన్‌ గా ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణియే సరైన వ్యక్తి అని భావించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ నమ్మకం వమ్ముకాలేదు. ప్రభుత్వ ప్రాధామ్యాలు ఏమైనప్పటికీ పరిమిత వనరులతో టెక్నాలజీని విరివిగా వినియోగిస్తూ గత ఆరేళ్లలో 108 నోటిఫికేషన్ల ద్వారా 35,724 ఉద్యోగ నియామకాలను ఎలాంటి ఆరోపణలకు ఆస్కారం లేకుండా టీఎస్‌ పిఎస్సి నియామకాలను పూర్తి చేసింది. టీఎస్‌ పిఎస్సి జారీ చేసిన 108 నోటిఫికేషన్లలో వందకు పైగా నోటిఫికేషన్ల విూద వివిధ కారణాలతో కోర్టుల్లో కేసులు నమోదవడం నియామక ప్రక్రియ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం. నోటిఫికేషన్లకు వ్యతిరేఖంగా కోర్టుల్లో నమోదైన అన్ని కేసులు కూడా సంబంధిత ప్రభుత్వ విభాగాలు రూపొందించిన నియమ నిబంధనలపైనే కానీ టీఎస్‌ పిఎస్సి వ్యవహారశైలి పైన కాదని విమర్శకులు గమనించాలి. నియామక ప్రక్రియ ఆలస్యం కావడానికి కారకులు ఎవరైనప్పటికీ నిందలు భరిస్తూ ఎలాంటి అవినీతి అక్రమాల ఆరోపణలకు తావు లేకుండా ఆరేళ్లలో 35,724 ఉద్యోగ నియామకాలు పూర్తిచేయడం టీఎస్‌ పిఎస్సి ఘనతగానే చెప్పుకోవచ్చు. టీఎస్‌ పిఎస్సి ఈ ఘనత సాధించడంలో చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి తో పాటు కమిషన్‌ సభ్యులందరూ భాగస్వామ్యులే. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కు తొలి చైర్మన్‌ గా ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి కృషితో జాతీయ స్థాయిలో వచ్చిన ప్రత్యేక గుర్తింపు ఇలాగే కొనసాగాలని పలువురు మేధావులు, సామాజిక విశ్లేషకులు ఆశిస్తున్నారు.