ఆర్అండ్బి రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి
వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు డిమాండ్
మునగాల, అక్టోబర్ 9(జనంసాక్షి): మునగాల మండల కేంద్రం నుండి కొక్కిరేణి మీదుగా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం వరకు 20 కిలోమీటర్ల వరకు ఆర్ అండ్ బి రోడ్డును వెంటనే నిర్మాణం చేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత కౌన్సిల్ సభ్యులు, మునగాల మండల మాజీ ఎంపీపీ ములకలపల్లి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం గణపవరం వాగుపైన ధర్నా నిర్వహించారు. అనంతరం ధర్నాను ఉద్దేశించి రాములు మాట్లాడుతూ, మూడు నియోజకవర్గాల్లో 20 గ్రామాల ప్రజలు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారని, ఈ రోడ్డుపై కనీసం మరమ్మతులు లేక గుంతలమయంగా మారిందని, వర్షాలు కురిసినప్పుడల్లా 20 గ్రామాలకు రాకపోకలు బంద్ అవుతున్నాయని వాపోయారు. ఈ రోడ్డు గుంతలమయం కావటంతో గత రెండు సంవత్సరాల్లో ఈ రోడ్డుపై ప్రమాదానికి గురై 6 గురు ప్రయాణికులు మృతి చెందారని గుర్తు చేశారు. అట్లాగే ప్రమాదాలు జరగటంతో అనేకమంది వికలాంగులు అయినారని రాములు అన్నారు. అనేకసార్లు ఆర్ అండ్ బి అధికారులకు విన్నవించినా కనీసం పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. కోదాడ, హుజూర్నగర్ ఎమ్మెల్యేలకు, ఎంపీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్అండ్బి అధికారులు కళ్ళుండీ చూడలేని కబోదిలా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. సి.ఆర్.ఎఫ్ నిధులతో 20 కోట్లు మంజూరు అయినట్లు గత మూడు సంవత్సరాల నుండి చెబుతున్నా గాని నేటికీ పనులు ప్రారంభించక పోవటం విచారకరమని, పనులు ప్రారంభిచపోవడం అధికారుల నిర్లక్షానికి కారణం అని వారు తెలిపారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రాములు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, బుర్రి శ్రీరాములు, సిపిఎం మండల కార్యదర్శి చందా చంద్రయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమపొంగు జానయ్య, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నందిగామ సైదులు, రైతు సంఘం మండల కార్యదర్శి దేశిరెడ్డి స్టాలిన్ రెడ్డి, గరిడేపల్లి మండల రైతు సంఘం అధ్యక్షులు యానాల సోమయ్య, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి గడ్డం వినోద్, యానాల రాజేష్, జిల్లా కమిటీ సభ్యులు చిన్న సైదులు, చందా వెంకటేశ్వర్లు, ములకలపల్లి సైదులు, ఇంటూరి హుస్సేన్, ఎస్.కె నబీ, బట్టల వెంకటయ్య, వివిధ గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.