ఆర్థిక దోపిడే అశాంతికి మూలం
శ్రీకాకుళం, జూలై 16: ప్రపంచ వ్యాప్తంగా నేడు అగ్రరాజ్యం అమెరికా వ్యాపారులను పెంచుకుంటూ ఆర్థిక దోపిడీ చేస్తుందని, ఇదే అశాంతికి మూలమని అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడారి ప్రభాకరరావు అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక జిల్లా ప్రెస్‌క్లబ్‌లో ఐప్సో శ్రీకాకుళం జిల్లా ఆరో మహసభ కొక్యాణ వేణుగోపాల్, సనపల నర్సింహమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలు చేస్తున్న ఆర్థిక దోపిడీని నిరోధించి భావి తరాలకు శాంతిని అందించాలని కోరారు. భవిష్యత్తు తరాల వారికి జీవించే హక్కు కల్పించడానికి, సహజవనరులు అందివ్వడానికి ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. పారిశ్రామిక విస్తరణ పేరుతో సముద్ర జలాలను కలుషితం చేయడం వల్ల అపార మత్స్య సంపద తదిగిపోతుందన్నారు. సీపీఐ నాయకుడు వి.జి.కె.మూర్తి మాట్లాడుతూ ఆర్థిక వనరులు ప్రభుత్వం చేతిలో ఉంటే కొంతవరకు దోపిడీ అరికట్టి కాపాడుకోవచ్చునన్నారు. జామి భీమశంకర్ మాట్లాడుతూ ప్రజలు సృష్టించిన సంపద కొదిమంది దనవంతుల చేతిలో ఉండడంతో ఎక్కువమంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా అఖిలభాత
శాంతి సంఘీభావ సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.