ఆర్థిక సంక్షోభాలపై నిర్లక్ష్య వైఖరి

వేయి విలువ రెండువేలకు చేరింది

సామాన్యుల ఇక్కట్లు పట్టించుకోని మోడీ సర్కార్‌

న్యూఢిల్లీ,జూలై5(జ‌నం సాక్షి): రూపాయి విలువ అంతకంతకూ పడిపోతున్నా దిద్దుబాటు చర్యలు మాత్రం కనిపించడం లేదు. మోడీ నాలుగేళ్ల పాలనలో డాలర్‌తో మారకం విలువ గతంలో ఎన్నడూ ఇంత దౌర్భాగ్య స్థితిలో లేదు. జీవన వ్యయం విపరీతంగా పెరిగిన కారణంగా ఆదాయం ఆమేరకు పెరక్క పోవడంతో సగటు జీవి సతమతం అవుతున్నాడు. వెయ్యి నోటుతో కొన్న వస్తువులు ఇవాళ రెండు వేల నోటు పెట్టినా కొనలేని దుస్థితిలో ప్రజలు ఉన్నారు. బ్యాంకుకో లేదా ఎటిఎంకో వెలితే డబ్బులు వచ్చాయా లేదా అన్నదే ముఖ్యం. బ్యాంకుల విశ్వసనీయతను దెబ్బతీయడంతో డబ్బులు వేయాలనుకునే వారు వాటి జోలికి పోవడం లేదు. నల్లధనం గురించి , పెద్దనోట్ల రద్దు గురించి , జీఎస్టీ గురించి సమర్థించుకునే ప్రకటనలు మానడం లేదు. వాటిని తన విజయాలుగా చెప్పుకునే విధంగా ప్రసంగాలు చేస్తున్నారు. ధరలు తగ్గాయని అంటున్నారు. ఇవన్నీ ప్రజలు నమ్ముతారా అన్నది చూడాలి. నాలుగేండ్లుగా దేశంలోని మధ్యతరగతి ప్రజలు మరిన్ని పన్ను రాయితీలు, ముఖ్యంగా ఆదాయపు పన్ను పరిమితి పెంపు వంటివి ఆశించి భంగపడ్డారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దేశంలో అవినీతి తగ్గిన దాఖలాలు లేవు కదా అనుకుంటే.. కుంభకోణాలు తగ్గలేదు. బ్యాంకుల నిజాయితీపై అనుమానాలు బలపడ్డాయి. ఎన్నికల్లో రాజకీయ అమ్మకాలు కొనుగోళ్లు తగ్గలేదు. నల్లధనం చెలామణితగ్గలేదు, కశ్మీర్‌లో రాళ్లు వేయడం లాంటి స్థాయి తగ్గలేదు. పాక్‌ దాష్టీకాలు తగ్గలేదు. బ్యాంకుల దివాళాకు ఆర్థిక మోసగాళ్లు కారణమయ్యారు. వారంతా దర్జాగా విదేశాలకు పారిపోతున్నా పట్టుకుని కట్టడి చేయలేదు. కాంగ్రెస్‌ పార్టీ ఇన్నేండ్లు చేసిన సకల పాపాలను బీజేపీ ఈ నాలుగేండ్లలో చేసేసింది. ప్రజల తీర్పునకు వ్యతిరేకంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, ప్రభుత్వాలను కూల్చడం, రాష్ట్రాల్లో తలదూర్చడం అన్నీ షరా మామూలే. తాను గొప్ప అని చెప్పుకోవడానికి ఏవిూ లేకపోవడంతో ప్రత్యర్థులను దునుమాడటంతో పాటు కశ్మీర్‌, అయోధ్యల చుట్టూ భావోద్వేగాలు రెచ్చగొట్టి ఎన్నికల గండం గట్టెక్కే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఈ దశలో కొన్ని రాష్ట్రాలు పూర్తి ప్రతికూలంగా ఉన్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో పాక్షిక వ్యతిరేకత ఉన్నది. ఆయన ఇప్పుడు ఏకైక పెద్దపార్టీగా అవతరించడమే గగనం. అది సాధిస్తే బీజేపీ మరోసారి అధికారంలోకి రావడానికి అవకాశం ఉండవచ్చు. అప్పుడు మద్దతునిచ్చే పార్టీలు, ఎన్డీయే భాగస్వామ్యపక్షాలు మోదీని నాయకుడిగా అంగీకరిస్తాయా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకం. అందుకే బిజెపి అధికరాంలోకి వచ్చినా మోడీ ప్రధాని కాలేరన్న చర్చ మొదలయ్యింది. నోట్ల రద్దును ఆనాడే వ్యతిరేకించానని ఆనాటి ఆర్‌బిఐ గవర్నర్‌ రఘురామరాజన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. పెద్దనోట్ల రద్దుతో దేశాన్ని దివాళా తీయించిన వైనం స్పష్టంగా కనిపిస్తోంది. బ్యాంకులు దివాళా తీసే స్థితికి వచ్చాయి. నగదు కొరత ఏడాదిన్నరగా వేధిస్తున్నా క్షేత్రస్థాయి సమస్యలను పట్టించుకోని ఆర్థిక మంత్రి జైట్లీ తన ప్రకటనలతో ప్రజలను ఇంకా మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఈ దేశం నిజాయతీ పరులదని, ఇందులో అక్రమార్కులకు చోటు లేదన్న మోడీ, రాజకీయ అవినీతిని రూపుమాపడంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆనాటి ప్రధాని మన్మోహన్‌ను మౌనముని అంటూ నిందించిన మోడీ ఇప్పుడు తానే అతిపెద్ద మౌనమునిగా మారారు. ఏ సమస్యపైనా స్పందించడం లేదు. పార్లమెంటు లోపలా, వెలుపలా కూడా నోరు విప్పలేదు. దీంతో సమస్యలను దాటవేసే ధోరణి కనిపిస్తోంది. అన్నిరంగాలను నిర్వీర్యం చేసి కార్పొరేట్లకు సలాం కొడుతున్న ఆత్మగౌరవ రాహిత్యం తాండవిస్తోంది. జిఎస్టీ, నోట్ల రద్దు ప్రభావాలు వేధిస్తున్నా వాటి గురించి గొప్పలు చెప్పుకోవడం దారుణం కాక మరోటి కాదు. అడుగడుగునా పాలనా వైఫల్యం కనిపిస్తున్నా దానిగురించి కప్పిపుచ్చుకుంటూ ప్రచారార్భాటలు చేయడం అలవాటుగా మారింది. అంబానీలు, అదానీల అంతులేని ధనదాహానికి దోహదం చేయడం తప్ప సాధించేదేవిూ లేదని గుర్తించుకోవాలి.