ఆర్మూర్‌లో రైతుల ఆందోళన

– పసుపుకు, ఎర్రజొన్నకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : పసుపు, ఎర్రజొన్న పంటల ఉత్పత్తులకు మద్దతు ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ నిజామాబాద్‌ జిల్లా రైతులు గురువారం రోడ్డెక్కారు. ఆర్మూర్‌ నియోజకవర్గం మామిడిపల్లి కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు. పసుపు క్వింటాకు రూ.15వేలు, ఎర్రజొన్న క్వింటాకు రూ.3,500 చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ.. నేడు ఎకరంలో పసుపు పండించాలంటే రూ.1.50లక్షల వరకు ఖర్చు అవుతుందని అన్నారు. కానీ ప్రభుత్వం రూ.4వేల ధర పెడితే ఒక ఎకరంలో సుమారు 75వేల వరకు రైతులు నష్టపోతున్నారని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని స్వామినాధన్‌ కవిూషన్‌ సిఫార్సులను అమలు చేయాలని 1.50వేల ధరను 50శాతం పెంచి చూస్తే క్వింటాకు రూ.15వేల ఇస్తానే రైతు బాగు పడతారని, రైతుకు గిట్టుబాటు అవుతుందన్నారు. అదేవిధంగా ఎర్రజొన్నకు రూ.3,500 ధర నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని, పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్‌లతో రైతులు ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా పసుపు రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.15వేలు మద్దతు ధర కల్పించాలని, కేంద్రం ప్రకటించకపోతే రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ చెల్లించి రైతులకు క్వింటా పసుపుకు రూ.15వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.