ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై హత్యాయత్నం

ఇంటివద్ద అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తి అరెస్ట్‌
అతనివద్ద నుంచి మారనాయుధాలు స్వాధీనం
కల్లెడ సర్పంచ్‌ భర్తగా గుర్తించిన పోలీసులు
హైదరాబాద్‌,ఆగస్ట్‌2(జ‌నంసాక్షి): ఆర్మూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 12 లోని వేమూరి ఎన్‌క్లేవ్‌ లో ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి నివాసం వద్ద ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తి ఆర్మూర్‌ నియోజకవర్గంలోని మాక్లూర్‌ మండలం కల్లెడ గ్రామ సర్పంచ్‌ భర్త ప్రసాద్‌ గౌడ్‌ గా గుర్తించారు. తన భార్యను సర్పంచ్‌ పదవి నుంచి సస్పెండ్‌ చేయించడంతోనే నిందితుడు ప్రసాద్‌ గౌడ్‌.. ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై కక్ష పెంచుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎమ్మెల్యే ఇంటి దగ్గర ప్రసాద్‌ గౌడ్‌ అనుమానాస్పదంగా తిరగడంతో ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రసాద్‌ గౌడ్‌ నుంచి కత్తి, ఒక పిస్తోలును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి పై హత్యా ప్రయత్నానికి ప్లాన్‌ జరిగిందనే ప్రచారం సాగింది. ఎందుకంటే బంజారాహిల్స్‌లో ఆయన ఇంటి వద్ద గుర్తుతెలియని ఒక వ్యక్తి తచ్చట్లాడుతూ కనిపించాడు. సదరు వ్యక్తి వద్ద కత్తి, పిస్తోలు కూడా ఉండటంతో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. తన భార్యను సర్పంచ్‌ పదవి నుంచి సస్పెండ్‌ చేయడంతో సదరు నిందితుడు కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరగుతుండటంతో ఎమ్మెల్యే సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఒక కత్తి, పిస్తోలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ వ్యక్తిని విచారిస్తున్నట్లు బంజారా హిల్స్‌ పోలీసులు పేర్కొన్నారు.