ఆర్‌ఎస్‌ఎస్‌పై నా వాఖ్యలకు కట్టుబడ్డా

1

– రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ,ఆగస్టు 25(జనంసాక్షి): రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌)పై కాస్త మెత్తబడ్డారన్న ఆరోపణలను కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఖండించారు. ఆరెస్సెస్‌పై తాను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడే ఉన్నట్లు స్పష్టంచేశారు. విద్వేషం, విభజన వాదం ఎజెండాగా ఉన్న ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా తాను పోరాడుతూనే ఉంటానని రాహుల్‌ తేల్చిచెప్పారు. తనపై దాఖలైన పరువునష్టం పిటిషన్‌పై కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేస్తూ.. తాను ఆరెస్సెస్‌ గాంధీని హత్య చేసిందని అనలేదని, ఆ సంస్థ అనుబంధ వ్యక్తులే దీని వెనక ఉన్నట్లు చెప్పానని వివరణ ఇచ్చారు. దీనిపై స్పందించిన ఆరెస్సెస్‌.. రాహుల్‌ తప్పు చేశారని, దానిని హుందాగా అంగీకరించి, క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. రాహుల్‌ చెప్పిన ఆ వ్యక్తులతో ఆరెస్సెస్‌కు ఎలాంటి సంబంధం ఉందో నిరూపించాల్సిన అవసరం ఆయనపై ఉందని స్పష్టంచేసింది. ఇదిలావుంటే మహాత్మాగాంధీ హత్య విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌పై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుగా ఒప్పుకొని, క్షమాపణ చెప్పాలని సంస్థకు చెందిన ప్రముఖ నేత ఎంజీ వైద్య అన్నారు. ‘ఆర్‌ఎస్‌ఎస్‌ మొత్తాన్ని తాను నిందించలేదని, సంస్థకు అనుబంధం ఓ వ్యక్తి బాధ్యుడని ఇప్పుడు రాహుల్‌ చెప్తున్నారు. అయితే ఆ వ్యక్తికి ఆర్‌ఎస్‌ఎస్‌తో ఎలా సంబంధం ఉంది, సంస్థలో ఎలాంటి బాధ్యతలు చేపడుతున్నాడో రాహుల్‌ స్పష్టత ఇవ్వాలి. అసలు నిజమేంటంటే రాహుల్‌ తప్పుగా మాట్లాడుతున్నారు. దాన్ని బహిరంగంగా ఒప్పుకొని క్షమాపణ చెప్పాలి’ అని వైద్య అన్నారు.2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మహారాష్ట్రలోని ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన రాహుల్‌.. ఆర్‌ఎస్‌ఎస్‌పై వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై సంస్థ కార్యకర్త ఒకరు పరువునష్టం కేసు పెట్టారు. దీనిపై రాహుల్‌ బుధవారం సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చారు. మహత్మాగాంధీని హత్య చేసిన సంస్థగా ఆర్‌ఎస్‌ఎస్‌ను తానెప్పుడూ నిందించలేదని, ఆ సంస్థతో అనుబంధం ఉన్న వ్యక్తి గాంధీ హత్యకు బాధ్యుడని మాత్రమే చెప్పానని రాహుల్‌గాంధీ పిటిషన్‌లో పేర్కొన్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.