ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌

4

న్యూదిల్లీ,ఆగస్టు 20(జనంసాక్షి): ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ నియమితులయ్యారు. తదుపరి గవర్నర్‌గా ఆయన రఘురామ రాజన్‌ స్థానంలో బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్‌గా ఉన్న ఆయన ఆర్‌బీఐ తదుపరి గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. సెప్టెంబర్‌ 4తో ప్రస్తుత గవర్నర్‌ రఘురాం రాజన్‌ పదవీకాలం ముగియనున్న సంగతి తెలిసిందే. పలువురి పేర్లు ప్రస్తావనకు వచ్చినా చివరకు డిప్యూటి గవర్నర్‌కు స్థానం కల్పించారు. ఈ మేరకు శుక్రవారం ఆర్తికమంత్రి జైట్లీ ప్రధాని మోడీని కలిసి చర్చించారు. ఈ భేటీలోనే తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.  దీంతో కొంత కాలం నుంచి కొత్త ఆర్‌బీఐ గవర్నర్‌ ఎవరన్న అంశంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.  ఉర్జిత్‌ పటేల్‌ 1963 అక్టోబరు 28న జన్మించారు. లండన్‌స్కూల్‌ ఆఫ్‌ ఎకానమిక్స్‌లో బీఏ అభ్యసించారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంఫిల్‌ పట్టా పొందారు.  అంతర్జాతీయ ద్రవ్యనిధిలో విధులు నిర్వహించారు.  2000-2004 మధ్య పలు కమిటీలకు పలు ఆర్థిక కమిటీలకు నేతృత్వం వహించారు.  2013లో రిజర్వ్‌బ్యాంక్‌ డిప్యూటీ గవర్నర్‌గా నియమితులయ్యారు.  ఆర్థిక సలహాదారుగా, బ్యాంకరుగా పలు కీలకస్థానాల్లో విధులు నిర్వహించిన పటేల్‌ను ఎన్డీయే సర్కారు రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నరుగా నియమించింది.