ఆలోచించి తెరాసకే ఓటేయండి

కూటమి నేతల మాటలకు మోసపోవద్దు

తెలంగాణను ఆగం చేసేందుకు వచ్చే వారితో జాగ్రత్త

ప్రచారంలో సోమారపు సత్యనారాయణ

గోదావరిఖని,నవంబర్‌22(జ‌నంసాక్షి): ప్రజలు ఆలోచించి ఓటేయాల్సిన ఎన్నికలు ఇవి అని, లేకుంటే తెచ్చుకున్న తెలంగాణ మళ్లీ ఆగమై పోతుందని రామగుండం టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ

అన్నారు. నాలుగేళ్లుగా తెలంగాణ అభివృద్దిలో ముందున్నదని, అది కొనసాగాలంటే మళ్లీ కెసిఆర్‌ సిఎం కావా/-లసిందేనని అన్నారు. కూటమి నేతలతో తెలంగాణ మళ్లీ వెనక్కి పోతుందని, మనకు చీకట్లు తప్పవని ప్రచారంలో హెచ్చరించారు. గత నాలుగేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసే తమకు ఓటేయ్యాలని సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో గడిచిన నాలుగేళ్లలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కేవలం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మాయమాటలతో సింగరేణి కార్మికులను, వారి కుటుంబీకులను బుట్టలో వేసుకోవడానికి మహాకూటమి నాయకులు వస్తున్నారనీ, వారి మాటలు నమ్మవద్దని కోరారు. మోసపూరిత మాటలతో గారడి చేస్తున్న విపక్షాలకు ఎ న్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. కార్మిక వాడల్లోని ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ ఇచ్చే బాధ్యత తానే తీసుకుంటాననీ, అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇం డ్లు ఇస్తామనీ, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం తోపాటు దళితులను అదుకుంటామని హావిూ ఇచ్చారు. కొంతమంది నేరచరితులు, భూకబ్జాదారులు

ఎన్నికల్లో పోటీ చేస్తూ, తమకు ఓట్లు వేయాలని కోరుతున్నారనీ, మరికొంతమంది సానుభూతితో ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొవడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై పోటీ పడుతున్నాయనీ, వాటిని ప్రజలు తిరస్కరించాలని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో పైరవీలకు అవకాశం లేదని, అర్హులందరికీ సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ పాలన సాగిందని గుర్తుచేశారు. కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌, కేసీఆర్‌ కిట్‌, పింఛన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎలాంటి పైరవీలు అవసరం లేకుండా అర్హులకు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. కాంగ్రెస్‌, తెలుగుదేశం పాలనలో ఆ పార్టీ కార్యకర్తలకే లబ్ధి చేకూరేదని పేర్కొన్నారు. గత పాలకులు ప్రజల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ప్రజల కష్టాలు తీర్చడానికి కృషి చేశామని చెప్పారు. మహాకూటమి పేరుతో వస్తున్న మాయల కూటమిని ప్రజలు మర్చిపోవాలన్నారు. సింగరేణి కార్మికులకు కేసీఆర్‌ చేసిన పనులు మరెవరూ ఎప్పటికీ చేయలేరనీ, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాగా, ఈ రోడ్‌షో, సభలకు భారీగా జనం తరలివచ్చారు. సోమారపు వెంట రామగుండం మేయర్‌ జాలి రాజమణి, డిప్యూటీ మేయర్‌ ముప్పిడి సత్యప్రసాద్‌, తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.