ఆవిర్భావ వేడుకలకు అధినేత్రి

` తెలంగాణకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీ!
` అవతరణ దినోత్సవానికి ‘హస్తం’ సర్కారు సమాయత్తం
` గ్రామగ్రామానా ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళికలు
` ఆరు గ్యారంటీల అమలు`సత్ఫలితాలపై ప్రజలకు వివరణ
` తెలంగాణ ఇచ్చిందీ, తెచ్చిందీ తామేనంటూ ఎలుగెత్తి చాటనున్న కాంగ్రెస్‌

ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. తమ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు సమాయత్తమౌతోంది. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ‘తెలంగాణను ఇచ్చిందీ తెచ్చిందీ కాంగ్రెస్‌ పార్టీయే’నంటూ వివరణ ఇచ్చుకున్న పార్టీ.. ఇదే విషయాన్ని మరొకసారి ఎలుగెత్తి చాటేందుకు సిద్ధమౌతోంది. గతేడాది దశాబ్ది ఉత్సవాల సందర్భంగా టీపీసీసీ వినూత్న పాదయాత్రకు శ్రీకారం చుట్టగా.. ఈయేడు ప్రభుత్వం వచ్చిన ఉత్సాహంతో మరింత ఉత్తేజభరిత వాతావరణంలో అవతరణ దినోత్సవాలను జరపాలని నిశ్చయించింది. ఈ వేడుకలకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని ముఖ్య అతిథురాలిగా తెలంగాణకు ఆహ్వానించనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఆరు గ్యారంటీల అమలు, ఈ ఆరు నెలల సుపరిపాలన, ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా కాంగ్రెస్‌ సర్కారు సకల ఏర్పాట్లలో నిమగ్నమయ్యేలా ప్రణాళికలు సైతం రూపొందించినట్టు తెలిసింది.

హైదరాబాద్‌, మే 16 (జనంసాక్షి):
గతేడాది దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బీఆర్‌ఎస్‌ సర్కారు వైఫల్యాలపై ఎక్కుపెట్టిన కాంగ్రెస్‌ పార్టీ.. వివిధ కార్యక్రమాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు యత్నించింది. దశాబ్దకాలం దగా పేరిట ఉత్సవాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో జరిగిన అభివృద్ధి పనుల్లో భారీఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన నాటి దశాబ్ది ఉత్సవాలకు మొదట సోనియా లేదా రాహుల్‌ గాంధీని ఆహ్వానించి తెలంగాణ సెంటిమెంట్‌ను తట్టిలేపాలని భావించినా పలు కారణాల రీత్యా లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ హాజరయ్యారు. తదనంతరం వరుస డిక్లరేషన్లు, గర్జనలు నిర్వహించిన కాంగ్రెస్‌ నాయకత్వం తెలంగాణలో ప్రజాదరణ పొంది, పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ కాంగ్రెస్‌ సర్కారును కొలువుదీర్చింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల జూన్‌ 2న తెలంగాణ అవతరణ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగించాలని భావిస్తున్న కాంగ్రెస్‌ సర్కార్‌.. గ్రామగ్రామానా ప్రభుత్వ పనితీరును వివరించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. తెలంగాణను ఇచ్చిందీ, తెచ్చిందీ కాంగ్రెస్సేనంటూ మరొకసారి ఎలుగెత్తి చాటేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం సిద్ధమైంది. ఎన్నికల్లో ఆదరించిన తెలంగాణ ప్రజల తరపున రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీని ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పునర్నిర్మాణమే లక్ష్యం..
బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో జరిగిన లోటుపాట్లను సవరిస్తూ నవ‘తెలంగాణ’ను ఆవిష్కరించే దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే కార్యచరణ చేపట్టింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి కూడా పలు సందర్భాల్లోనూ ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం కొనసాగిస్తున్న ప్రణాళికలు, వాటి అమలును అవతరణ వేడుకల్లో మరొకసారి ప్రజలకు వివరించాలని కాంగ్రెస్‌ సర్కార్‌ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆరు గ్యారంటీల అమలు, రైతుల సంక్షేమం, నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ కల్పన, ఇత్యాది ప్రభుత్వ కార్యకలాపాలను కూలంకుషంగా ప్రస్తావించనున్నట్టు తెలిసింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా తెలంగాణ అవతరణ వేడుకలను స్ఫూర్తిమంతంగా జరిపి, ఆ ఎన్నికల్లోనూ సత్ఫలితాలు సాధించాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. ఈ మేరకు అటు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు, ఇటు స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్‌ సర్కార్‌ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.