ఆసీస్‌ కోచ్‌ మికీ ఆర్థర్‌పై వేటు


మెల్‌బోర్న్‌, జూన్‌ 24 (జనంసాక్షి) : ప్రతిష్టాత్మకమైన యాషెస్‌ సిరీస్‌కు ముందు ఆస్టేల్రియా క్రికెట్‌ బోర్డ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జాతీయ జట్టు కోచ్‌గా వ్యవహరిస్తోన్న మికీ ఆర్థర్‌పై వేటు వేసింది. అధికారికంగా ఇంకా ప్రకటించకున్నప్పటకీ… క్రికెట్‌ ఆస్టేల్రియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఈ విషయాన్ని ధృవీకరించారు. దీంతో ఆర్థర్‌ స్థానంలో డారెన్‌ లీమన్‌ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే యాషెస్‌ సిరీస్‌ ప్రారంభానికి ముందు కోచ్‌ను తప్పించడం ఆందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 2011లో టిమ్‌ నెల్సన్‌ తప్పుకోవడంతో అతని స్థానంలో బాధ్యతలు తీసుకున్న మికీ ఆర్థర్‌ ఆస్టేల్రియాకు ఆశించిన స్థాయిలో విజయాలు అందించలేకపోయాడు. ఆ ఏడాది జరిగిన యాషెస్‌ సిరీస్‌లో జట్టు ఘోరపరాజయం పాలవడంతో పాటు క్రమంగా ప్రదర్శన దిగజారింది. భారత్‌పై స్వదేశంలో 4-0 తేడాతో టెస్ట్‌ సిరీస్‌ కైవసం చేసుకోవడం తప్పిస్తే.. చెప్పుకోగదగిన ప్రదర్శనలు లేవు. ఆర్థర్‌ కోచింగ్‌లో 19 టెస్టులు ఆడిన ఆసీస్‌ పదింటిలో విజయం సాధించింది. అయితే భారత పర్యటనలో మాత్రం వారికి చుక్కెదురైంది. ఆడిన నాలుగు టెస్టుల్లోనూ ఘోరంగా ఓడిపోయింది. తర్వాత జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో కూడా ఆస్టేల్రియా వైఫల్యాల బాటలోనే నడిచింది. ఒక్క మ్యాచ్‌ కూడా గెలవకుండా ఇంటిదారి పట్టింది..ఈ నేపథ్యంలో ఆర్థర్‌ పనితీరుపై అసంతృప్తితో ఉన్న ఆసీస్‌ బోర్డ్‌ అతనిపై వేటు వేసేందుకే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అటు కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ జట్టు సెలక్షన్‌ బాధ్యతల నుండి తప్పుకోవాలని భావిస్తున్నాడు. సెలక్షన్‌ కమిటీ విూటింగ్‌లో తాను ఉండకూడదని నిర్ణయించుకున్నట్టు ఆసీస్‌ బోర్డుకు తెలియజేశాడు. ఇదిలా ఉంటే కొత్త కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాలున్న లీమన్‌ ప్రస్తుతం ఆసీస్‌ ఎ జట్టుకు మెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా జూలై 10 నుండి ప్రారంభం కానున్న యాషెస్‌ సిరీస్‌ మొదటి టెస్టుకు ముందు ఆస్టేల్రియా రెండు టూర్‌ మ్యాచ్‌లు ఆడనుంది.