ఆహార ధాన్యాల దిగుమతులే అసలు సమస్య

దేశీయ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తున్న దిగుమతులు

సమగ్ర వ్యవసాయ విధానంతోనే రైతులకు మేలు

న్యూఢిల్లీ,జూలై6(జ‌నం సాక్షి): పలు కేంద్ర, రాష్ట్ర పథకాలు అమలవుతున్నప్పటికీ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో చెప్పుకోదగ్గ పురోగతి కనిపించడం లేదు. నిర్ధేశిత లక్ష్యాల సాధనలో ప్రతియేటా ఆమడ దూరంలో వెనుకబడిపోవడం భారత వ్యవసాయరంగం దుస్థితికి అద్దం పడుతుంది. ఆహారధాన్యాల ఉత్పత్తి, ఉత్పాదకత.. మొత్తంగా వ్యవసాయాభివృద్ధి రేటును అనుకొన్నవిధంగా ఏ సంవత్సరంలోనూ అందుకోలేక పోవడం ఏటా జరుగుతన్నదే. మద్దతు ధరలు పెంచినా ధాన్యం కొనుగోలులో భరోసా లేకపోవడంతో రైతులు ఏటా నస్టపోతున్నారు. ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న జనాభాకు సరిపోయే పరిమాణంలో ఆహార ధాన్యాలను పండించలేకపోవడం, దిగుమతులు పెరగడం, రైతులకు ప్రోత్సాహం దక్కడం లేదు. గత నాలుగేళ్లుగా సగటున ఆహార ధాన్యాల్లో పెరుగుదల కేవలం 15 లక్షల టన్నులు మాత్రమే. ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక వ్యవసాయరంగంలో పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడంలో లక్ష్య శుద్ది లేకపోవడంతో దేవీయ వ్యవసాయ రంగం కుదేలయ్యిందనే చెప్పాలి.ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి కేవలం ఆహార ధాన్యాల దిగుమతుల విూదనే కేంద్రం ఆధారపడుతున్న తీరు కారణంగా విదేశీ మారక నిల్వలు కోల్పోవాల్సి వస్తోంది. ఉల్లిపాయలను పండించే రైతులను విస్మరించడం కారణంగా వాటిని కూడా దిగుమతి చేసుకునే దౌర్భాగ్యం తప్పలేదు. పప్పులు, నూనెగింజలు, ఇతర చిరు, తృణధాన్యాల దిగుమతుల కారణంగా ఆర్థికంగానష్టపోయాం. అవే డబ్బులు ఇక్కడి రైతులకు ప్రోత్సాహకంగా ఇచ్చివుంటే మరింత ఉత్పత్తి జరిగిఉండేది. ఆహార ధాన్యాల దిగుమతుల కారణంగా డాలర్‌ మారకం కూడా భారీగా పెరుగుతోంది. ఇవే కాకుండా దేశంలోకి విదేశీ కూరగాయలు, పండ్లు విస్తారంగా దిగుమతి అవుతున్నాయి. ప్రభుత్వ విధానాలను ఆసరా చేసుకొని వ్యాపారులు ఆస్టన్రేలియా వంటి దేశాల నుంచి గోధుమలు, చిరుధాన్యాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి దేశీయ మార్కెట్‌లను ముంచెత్తుతున్నారు. ఫలితంగా.. రైతులకు కనీసమద్దతు ధర లభించని దుస్థితి ఎదురవుతున్నది. కనీస మద్దతు ధర అందిస్తే రైతులు మరింత ఉత్సాహంగా పంటలు పండించడానికి సిద్దంగా ఉన్నారు. అయితే మోడీ అధికారంలోకి వచ్చినా సరైన వ్యవసాయ విధానం అమలు కావడం లేదు. అన్ని పంటలకు సహేతుకమైన రీతిలో మద్దతు ధరల్ని అందించాలని రైతులు డిమాండ్‌ చేస్తోంటే, అసలు మద్దతు ధరలకు పంటలను కొనే విధానం నుంచి పూర్తిగా తప్పుకోవాలని కేంద్రం కసరత్తు చేస్తోంది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి చర్యలు తీసుకొంటామని మోదీ చెబుతున్నా అందుకు తగ్గ కార్యాచరణ కానరావడం లేదు. వివిధ రాష్టాల్లో ఉపాధి హావిూ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానిం చడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను, లాభాలను కూలంకషంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జాతీయ రైతువిధానం రూపొం దించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాలంచెల్లిన ప్రభుత్వాల విధానాలు రైతాంగానికి శాపాలే తప్ప 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపుకావడం హావిూకే పరిమితమౌతుంది.డా స్వామినాథన్‌ సిఫార్సుల పైన కనీస చర్యలు లేవు. ఇటీవల అన్ని రాష్టాల్ర ముఖ్యమంత్రులతో నీతిఆయోగ్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ వ్యవసాయరంగంలో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రులు సభ్యులుగా ఓ టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తిచేసుకొని.. ముందస్తుగా ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్న ఎన్డీఏకు వ్యవసాయరంగంలో తీసుకోవాల్సిన మెరుగైన చర్యలను టాస్క్‌ఫోర్స్‌ ఎప్పటిలోగా సూచించగలదు? ఆ సూచనలను ఎన్డీఏ ఎప్పటి నుంచి అమలు చేయగలదన్నది ప్రశ్నార్థకమే.

—————