ఇంకా పెర‌గ‌నున్నపెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆల్ టైం రికార్డ్ దిశగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.80కి చేరింది. ఇది సరికొత్త ధర. అదే విధంగా డీజిల్ అయితే రికార్డ్స్ బ్రేక్ చేస్తూ లీటర్ రూ.73కి చేరింది. డీజిల్ రేటు అయితే ఇండియా చరిత్రలో అత్యధిక ధర ఇది. లీటర్ పెట్రోల్ రూ.80 అని కళ్లు తిరిగి.. నోరెళ్లబెడుతున్నారా.. ఆగండి ఆగండి.. ఇంకా ఉంది. రాబోయే 15 రోజుల్లో మరో రూ.5 పెరిగినా మీరు కంగారు పడొద్దు. ఆ దిశగానే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. జూన్ మొదటి వారానికి లీటర్ పెట్రోల్ రూ.85, లీటర్ డీజిల్ రూ. 76కి చేరుకోవచ్చని చెబుతున్నాయి ఆయిల్ కంపెనీలు.

మే 14 నుంచి 18వ తేదీ వరకు లీటర్ పెట్రోల్ పై రూపాయి పెరిగింది. కర్నాటక ఎన్నికల క్రమంలో.. అంతకు ముందు 19 రోజులు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఆ తర్వాత ప్రతి రోజూ 15 నుంచి 20పైసలు చొప్పున పెరుగుతూ వస్తోంది. అత్యధికంగా శుక్రవారం లీటర్ పెట్రోల్ పై 31పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో రూ.80.09కి చేరింది. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరగటంతోపాటు డాలర్ తో రూపాయి మారకం విలువ భారీ పతనం కావటం కూడా ధరలు పెరగటానికి కారణంగా చెబుతున్నాయి ఆయిల్ కంపెనీలు. పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.4 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఓ రూపాయి పెంచటం జరిగింది. మరో 15 రోజుల్లో మిగతా ధర పెరుగుతూ పోతుంది. ఆల్ ద బెస్ట్ రైడర్స్…