ఇంటింటికి తాగునీరు ఘనత కెసిఆర్‌దే
కాళేశ్వరం పూర్తయితే ముదిరాజ్‌లకు పండగే పండగ
సంక్షేమ రంగంలో ముందున్న తెలంగాణ
మత్స్యకారులకు అండగా నిలిచాం
కూటమి పేరుతో వస్తున్న వారిని తిప్పి కొట్టండి
గజ్వెల్‌లో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు ఖాయం
ముదిరాజ్‌ల సభలో హరీష్ రావు
గజ్వేల్,నవంబర్5(జనంసాక్షి): వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి డిపాజిట్ గల్లంతవ్వడం ఖాయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు.గజ్వేల్ ప్రజల పట్టుదల, వారి ముఖాల్లో చిరునవ్వు చూస్తుంటే.. భారీ మెజార్టీతో సీఎం కేసీఆర్ గెలుపు ఖాయమనిపిస్తోందని ఆశాభావం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతుగా ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌రావు మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ది త్యాగాల చరిత్ర, కాంగ్రెస్‌ది వెన్నుపోటు చరిత్ర, తెలంగాణలో టీడీపీది ముగిసిన అధ్యాయమని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం పూర్తయితే ముదిరాజ్‌లకు చేతినిండా పని, కడుపునిండా తిండి దొరుకుతుందన్నారు. వచ్చే వానాకాలం నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేస్తామని తెలిపారు. మహాకూట మి డిసెంబర్ 11 తర్వాత కనుమరుగు కాక తప్పదని ఎద్దేవాచేశారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హరీశ్‌రావు హెచ్చరించారు. గతంలో ప్రజలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంత మంది నేతలకు ఓట్లు వేసినప్పటికీ ఏమాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. తాగునీరు సైతం ఇవ్వలేదని, ఇప్పుడేం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ధ్వజమెత్తారు. కానీ, గత నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్ ఎంతగా అభివృద్ధి చేశారనే విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో పేదింటి ఆడపడుచులను కల్యాణ లక్ష్మి పథకం ఆదుకుంటుందని, గర్భవతులకు ఉచిత కాన్పు చేసి కేసీఆర్ కిట్లు అందజేస్తున్నామన్నారు. గజ్వేల్‌లో అభివృద్ధికి కేసీఆర్ నాంది పలికారని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మత్స్యకారులను ఆదుకున్న గనత కెసిఆర్‌దన్నారు. మిషన్‌భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. గజ్వేల్‌లో అభివృద్ధికి నాంది పలికింది సీఎం కేసీఆరేనని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్, నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ముసుగులో చంద్రబాబు తెలంగాణకు వస్తున్నాడని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోనియాగాంధీని ఇటలీ దెయ్యమన్న చంద్రబాబుకు ఇవాళ ఆమె దేవత ఎలా అయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చెల్లని రూపాయిలాంటివాడని, తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకొనేందుకు కూటమిగా వస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే ఈ ఎన్నికల్లో తెలంగాణలో చంద్రబాబుతో ప్రచారం చేయించాలని డిమాండ్ చేశారు. అధికారంకోసం అవకాశవాద రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. ఈ ఎన్నికలు అభివృద్ధికి, అవకాశవాదానికి మధ్య జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం అవకాశవాద రాజకీయాల కోసం సిద్దాంతాలను పక్కకు పెట్టి ఆ పార్టీతో జతకడుతున్నదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే దమ్ములేక కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్, టీడీపీ నాయకులు అందరూ ఒకటవుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ టికెట్లు, నోట్లకట్టలు, మాట్లాడాల్సిన స్క్రిప్టు అమరావతి నుంచే వస్తున్నాయని తెలిపారు. కేసీఆర్ దెబ్బతో చంద్రబాబు అమరావతిలో పడ్డడు… ఇంకా పిచ్చివేషాలు వేస్తే
పుట్టగతులు లేకుండా చేస్తాం అని మంత్రి హెచ్చరించారు. సబ్బండవర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషిచేస్తున్న టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాల హయాంలో మంత్రుల్లాగా ఏసీ గదుల్లో కూర్చోలేదని, రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో రేయింబవళ్లు కష్టపడి పనిచేశామని హరీశ్‌రావు చెప్పారు.