ఇందిరబాటపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్
కాకినాడ, జూలై 11: ఇందిరబాట కార్యక్రమంలో భాగంగా ఈనెల 12,13,14 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సహకరించాలని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ కోరారు. పోలీస్ శాఖ పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా సూపరింటెండెంట్ త్రివిక్రమవర్మను కోరారు. ఆర్‌డిఓలంతా ఆయా డివిజన్లలో ముఖ్యమంత్రి పర్యటన ప్రదేశాలను సందర్శించి అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పంచాయితీశాఖ వారి పరిసరాల, పరిశుభ్రత, శానిటేషన్‌కు ఏర్పాట్లు చేయాలన్నారు. సంబంధిత శాఖ అధికారులందరు వారి శాఖకు సంబంధించి పూర్తి సమాచారంతో సిద్దంగా ఉండాలని ఆమె ఆదేశించారు.క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది వారి వారి కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలన్నారు. ఐటిడిఎకు సంబంధించి గిరిజన తండా, ఇరిగేషన్ అధికారులతో భూపతిపాలెం రిజర్వాయర్, హౌసింగ్‌శాఖ నిర్మించిన గృహ నిర్మాణాలు, టెక్స్‌టైల్స్‌కు సంబంధించి అధికారులు వారికి కేటాయించిన పనులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లు పర్యవేక్షించాలన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఇతర ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొంటున్నందున సంబంధిత శాఖల అధికారులు వారికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. బ్యాంకుల ద్వారా ఆయా శాఖ ల లబ్దిదారులకు రుణాలకు సంబంధించి మంజూరు ఉత్తర్వులు సిద్దం చేయాలని బ్యాంర్లు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.