ఇందిరమ్మను అవమానపరుస్తారా?

` బీఆర్‌ఎస్‌ ఓటమి ఖరారైంది
` ఆత్మహత్యలు, నిరుద్యోగంలో తెలంగాణ నంబర్‌ వన్‌
` కేసీఆర్‌ దొరహంకారాన్ని తరిమి కొట్టండి
` తాగిబోతుల అడ్డాగా మార్చిన ఘనుడు ఆయన
` ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇదేనా?
` పరకాల,నర్సాపూర్‌ సభలో రేవంత్‌ రెడ్డి ధ్వజం
వరంగల్‌(జనంసాక్షి): దొరల రాజ్యాన్ని బొందపెట్టి ఇందిరమ్మ రాజ్యం తేవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో దొరహంకారాన్ని తుదముట్టించాలని అన్నారు. ప్రజలు కెసిఆర్‌ అహంకారాన్ని అణచాలని అన్నారు. సోమవారం నాడు పరకాల విజయభేరి సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..ఇందిరమ్మ రాజ్యం అంటే బీఆర్‌ఎస్‌ నేతలు హేళన చేస్తున్నారు. దొరల రాజ్యం కావాలా, ఇందిరమ్మ రాజ్యం కావాలా తేల్చుకోండన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం, భూమిలేని పేదలకు భూపంపిణీ చేశాం. బడి, గుడి, నీళ్లు ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యమే. ’దొర ఏందిరో’ అని పిడికిలి ఎత్తింది ఇందిరమ్మ రాజ్యం. ఎస్సీ, ఎస్టీలు పదవులు అనుభవించేలా ఇందిరమ్మ రాజ్యం చేసింది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణను ఇందిరమ్మ రాజ్యం ఇచ్చిందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కొండా దంపతులు పరకాల నుంచి వెళ్లాక కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టారని, అయినా ఇన్నేళ్లు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అణచివేతను తట్టుకున్నారని అన్నారు. కడుపులో పెట్టుకొని కాపాడే రేవూరి విూకోసం వచ్చాడు. నిండు చెరువులా సభకు జనం కదిలివచ్చారు. సాయుధ రైతాంగ పోరాటానికి పరకాల ఫిరంగిలా మారింది. తెలంగాణ ఉద్యమాన్ని పరకాల ఉవ్వెత్తున ఎగిసేలా చేసింది. తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ జన్మస్థలం కూడా పరకాలనే అని గుర్తుంచుకోవాలన్నారు. సార్‌ కలలు కన్న తెలంగాణ రాలేదని, ఆయన ఉంటే బాధపడేవారని అన్నారు. ప్రత్యేక నిధులు ఇచ్చి పరకాలను అభివృద్ధి చేస్తామన్నారు. కేసీఆర్‌ మాటలు చూస్తే మందేసి, మతి తప్పి మాట్లాడినట్లు ఉందన్నారు. తెలంగాణలో అరాచకం రాజ్యమేలుతోందని, రాచరిక పాలన సాగుతోందన్నారు. కేసీఆర్‌ పాపం పండిరది, ఆయన పాలనకు కాలం చెల్లింది. కేసీఆర్‌ ను ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చేసింది. తెలంగాణలో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్‌ ను గెలిపించాలన్నారు. ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలుచేస్తాం, ఈ బాధ్యత తాను తీసుకుంటానన్నారు.
ఆత్మహత్యలు, నిరుద్యోగంలో తెలంగాణ నంబర్‌ వన్‌
వరంగల్‌/మెదక్‌(జనంసాక్షి): కెసిఆర్‌ చెప్పినట్లు రైతు ఆత్మహత్యుల, నిరుద్యోగం, మద్యంలో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇదేనా తెలంగాణ కోరుకున్న నంబర్‌ వన్‌ అని ఎద్దేవా చేశారు.  అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఒకేరోజు మూడు నుంచి నాలుగు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొని తమ పాలనలో తెలంగాణ ఎన్నో విషయాల్లో నెంబర్‌ వన్‌ అయిందని చెబుతున్నారు. తెలంగాణ నెంబర్‌ వన్‌  అనే కేసీఆర్‌ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి  ఘాటుగా స్పందించారు.  సీఎం కేసీఆర్‌ చెప్పినట్లే తెలంగాణ నెంబర్‌ 1 అని, అయితే రైతుల ఆత్మహత్యల్లో నెంబర్‌ వన్‌ అని, నిరుద్యోగ సమస్యల్లో రాష్ట్రం నెంబర్‌ వన్‌ అని సీఎం కేసీఆర్‌ పై సెటైర్లు వేశారు. తాగుబోతుల అడ్డాగా దేశంలోనే నెంబర్‌ 1గా తెలంగాణను మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌ సొంతమన్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ లో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి యాత్రలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కొందరు నేతలు పదవుల కోసం అమ్ముడుపోయినా, కార్యకర్తలు మాత్రం పార్టీని గెలిపించడానికి ఇక్కడికి వచ్చారు. పార్టీ ఫిరాయించిన ఒక నమ్మకద్రోహికి బీఆర్‌ఎస్‌ ఇక్కడ టికెట్‌ ఇచ్చిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నర్సాపూర్‌ ను చార్మినార్‌ జోన్‌ లో కలిపే అంశాన్ని కాంగ్రెస్‌ పరిగణనలోకి తీసుకుంటుంది. నర్సాపూర్‌ లాంబాడి సోదరుల అడ్డా అని, లాంబాడాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం చేసిందేం లేదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే నర్సాపుర్‌ పరిధిలోని లంబాడా తండాల అభివృద్ధి కోసం రూ.100 కోట్ల ప్రత్యేక నిధులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్‌ తీసుకుంటుందన్నారు. రాష్టాన్న్రి బంగారు తెలంగాణ చేస్తామన్న సీఎం కేసీఆర్‌ బొందలగడ్డ తెలంగాణగా మార్చారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్టాన్ని నెంబర్‌ వన్‌ చేస్తానని చెప్పి.. తాగుబోతుల అడ్డాగా, రైతుల ఆత్మహత్యల్లో, నిరుద్యోగ సమస్యల్లో తెలంగాణను నెంబర్‌ వన్‌ చేశారంటూ సీఎం కేసీఆర్‌ పాలనను విమర్శించారు. అమ్ముడుపోయి కేసీఆర్‌ పంచన చేరిన వారిని అసెంబ్లీ గేటు తాకనివ్వద్దు అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి కేకల రాజ్యం అని కేసీఆర్‌ అంటుండు.. మన లాంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చిన పార్టీ ఇందిరమ్మదేనన్నారు. తండాల్లో, మారుమూల పల్లెల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. భూమి అంటే ఆత్మగౌరవం అని, 25 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములను పంచిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని పేర్కొన్నారు. దళితులు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేశాం. పోడు భూములకు పట్టాలు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. సాగునీటి ప్రాజెక్టులు కట్టి వ్యవసాయానికి సాగునీరు అందించింది కాంగ్రెస్‌. స్థానిక సంస్థల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు కల్పించాం. ఇందిరమ్మ రాజ్యం లేకపోతే.. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్‌ కుటుంబం అడక్కు తినేదంటూ తీవ్ర వ్యాఖ్యలుచేశారు. సిద్దిపేటలో సింగిల్‌ విండో డైరెక్టర్‌ గా కేసీఆర్‌ కు అవకాశం ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం.. కాంగ్రెస్‌ కాదా అని రేవంత్‌ ప్రశ్నించారు.గతంలో యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నిన్ను నియమించిన సంజయ్‌ గాంధీ ఇందిరమ్మ కుమారుడు అనే సంగతి మరిచిపోయావా కేసీఆర్‌?. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే కేసీఆర్‌ కు ప్రజలు బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో అరాచకం రాజ్యమేలుతోందని, రాచరిక పాలన సాగుతోందన్నారు. కేసీఆర్‌ పాపం పండిరది, ఆయన పాలనకు కాలం చెల్లింది. కేసీఆర్‌ ను ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చేసింది. తెలంగాణలో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్‌ ను గెలిపించాలన్నారు. ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలుచేస్తాం, ఈ బాధ్యత తాను తీసుకుంటానన్నారు.