ఇందిరమ్మ బిల్లులకు మోక్షం
– చెల్లింపుల్లో జాపాన్ని సహించేది లేదని మంత్రి పొన్నాల సృష్టీకరణ
వరంగల్, జూన్ 27 : జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణ సథకంలో లబ్ధిదారులను బిల్లులను ఏ విధమైన జాప్యం లేకుండా వెంటనే చెల్లింపులు జరపాలని గృహ నిర్మాణ సంస్థ అధికారులను రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపు విషయాలలో ఏ విధమైన జాప్యం లేకుండా నియమిత సమయంలో చెల్లించాలని స్పష్టం చేశారు. పరకాల నియోజకవర్గంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్దిదారులకు సంబంధించి పెండింగ్ బిల్లుల వివరాలు, బిల్లులు చెల్లించిన వివరాలన్నింటినీ తనకు సమర్పించాలని ఆదేశించారు. దేవాదలు ఎత్తిపోతుల పథకం ద్వారా ప్రస్తుత ఖరీఫ్‌లో బొమ్మకూరు రిజర్వాయర్ ద్వారా 31వేల ఎకరాలకు గండిరామారం ద్వారా 4వేల ఎకరాలకు నీరందించనున్నట్లు వెల్లడించారు. గండిరామారం రిజర్వాయర్‌కు సంబంధించి భూసేకరణ వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని భూ సేకరణ స్పెషల్ కలెక్టర్‌ను ఫోన్ ద్వారా ఆదేశించారు. కాకతీయ వైద్య కళాశాల ఆవరణలో ఉన్న నర్సింగ్ కళాశాలకు గత మూడు నెలలుగా విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించిన ట్రాన్స్‌కో అధికారులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఎంజిఎం ఆసుపత్రిలో వెంటిలేటర్ల నిర్వహణకు ప్రభుత్వం అందిస్తున్న గ్రాంటు సరిపోవడం లేదని, ఈ గ్రాంటును పెంపొందించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించి దీని ప్రతిని తనకు ఇవ్వాలని ఎంజిఎం సూపరింటెండెంట్‌ను మంత్రి ఆదేశించారు. జిల్లాలోని ప్రతి మండలానికి కరవు నివారణ పద్దులో ఐదు లక్షల రూపాయల చొప్పున మంజూరైన నిధులతో పనులన్నింటిని పూర్తి చేయాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను పొన్నాల ఆదేశించారు.