ఇది సకల జనుల బడ్జెట్‌

ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక చట్టబద్ధం, చారిత్రాత్మకం
2014 నాటికి 50 ప్రాజెక్టులు పూర్తి
రాజీవ్‌ యువకిరణాల్లో 15 లక్షల మందికి ఉపాధి
ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌
హైదరాబాద్‌, మార్చి 13 (జనంసాక్షి):
ప్రభుత్వ ప్రతినిధి ¬దాలో గవర్నర్‌ నరసింహన్‌ రాష్ట్ర ఉభయ సభలనుద్దేశించి బుధవారం ప్రసంగించారు. ఆద్యాంతం ఆయన కిరణ్‌ సర్కార్‌ ఘనతను చెప్పుకోవడంతోనే సరిపోయిందన్న విపక్షాల విమర్శల మాట ఎలా ఉన్నా ఆయన ప్రసంగంలో పలు కీలక అంశాలు చోటుచేసు 1
కున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ అందజేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని గవర్నర్‌ పునరుద్ఘాటించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోమారు స్పష్టీకరించారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తొలిరోజైన బుధవారం గవర్నర్‌ నరసింహన్‌ రాష్ట్ర శాసన, శాసన మండలి సభలనుద్దేశించి ప్రసంగించారు. తెలుగులో ప్రసంగాన్ని ఆరంభించారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం రూపకల్పన రాష్ట్ర చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. ప్రభుత్వం ద్రవ్య విధానంలో తీసుకువచ్చిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వెల్లడించారు. నీలం తుపాను వల్ల రాష్ట్రంలో పంట నష్టం భారీగా జరిగిందని చెప్పారు. ఉగ్రవాద నేరాలకు పాల్పడే వారిపై ప్రభుత్వం అలసత్వం వహించదని అన్నారు. సురక్షిత నగర భావన కోసం హైదరాబాద్‌లో సమగ్ర నిఘా కెమెరా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఉగ్రవాద దాడుల్లో మరణించిన కుటుంబాలను, శాశ్వత వైకల్యం పొందిన వారిని ఆదుకుంటామని తెలిపారు. రూపాయికి కిలో బియ్యం పథకం వల్ల రాష్ట్రంలో చాలామంది లబ్ధిపొందుతున్నారని చెప్పారు. 2013-14 నాటికి 50 ప్రాజెక్టులను పూర్తి చేసి తద్వారా 34 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. జలయజ్ఞం ద్వారా రాష్ట్రంలో 80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. పోలవరం, చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టులకు జాతీయ ¬దా కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 32 లక్షలకు పైగా వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్లు చెప్పారు. తీవ్ర విద్యుత్‌ కొరత ఉన్నా రైతులుకు ఉచిత విద్యుత్‌ సరఫరాకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. 2012-13లో ప్రకృతి విపత్తుల కారణంగా వ్యవసాయ రంగం వృద్ధి రేటు తగ్గి 1.96గానే నమోదైందని వివరించారు. జననీ శిశు సురక్ష పథకం ద్వారా బాలింతలకు నగదు పోత్సాహకం అందిస్తున్నామని చెప్పారు. రాజీవ్‌ యువకిరణాల కింద 15 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ ద్వారా ఆహార భద్రతను సాధిస్తామని చెప్పారు. పేదరికాన్ని 12వ పంచవర్ష ప్రణాళి కాలంలో నిర్మూలించడమే తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. వామపక్ష తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణకు అభివృద్ధి, సమర్థపాలన అనే దీర్ఘకాలిక ప్రణాళిక అమలు చేస్తున్నామని చెప్పారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రాల సరిహద్దులుగా ఉన్న 8 జిల్లాల్లో ఏకీకృత కార్యాచరణ అమలు చేస్తామని తెలిపారు. మరోపక్క తెరాస ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ”బ్లాక్‌మెయిలింగ్‌ కోసమే తెరాస, వైకాపాలు అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమయ్యాయి. బెయిల్‌ కోసం బేరసారాలు నెరిపేందుకు వైకాపా, ప్యాకేజీలు మాట్లాడుకునేందుకు తెరాస ఈ డ్రామా ఆడుతున్నాయి. ఇప్పటికే సహకార ఎన్నికల్లో దెబ్బతిని నష్టపోయారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే పరిస్థితి ఎదురైతే తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల నాటికి వారి పార్టీలు బలహీనపడిపోతాయన్న ఆందోళనతో ఆ పార్టీల రాజకీయ మనుగడకోసం ఇప్పుడు అవిశ్వాసం డ్రామాకు తెరతీశాయి. అలాంటి బ్లాక్‌మెయిలింగ్‌, రాజకీయ అజెండాలతో అవిశ్వాసం పెడుతున్న వారి వలలో మనం ఎందుకు పడాలి? తోక పార్టీలను పట్టుకుని ఎందుకు వెళ్లాలి? రేపోమాపో కాంగ్రెస్‌లో కలిసిపోయే ఆ పార్టీలతో ఎందుకు కలిసి వెళ్లడం? ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వం మెడలు వంచేందుకు పోరాడదాం. ప్రభుత్వం దిగిరాకపోతే అవిశ్వాసం పెట్టడంపై సరైన సమయంలో సొంతంగా నిర్ణయం తీసుకుందాం” అని తెలుగుదేశం పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. అవిశ్వాస తీర్మానం పెడతామని తెరాస ప్రకటించిన నేపథ్యంలో తమ పార్టీ వ్యూహం ఎలా ఉండాలనే అంశంపై మంగళవారం రాత్రి తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తమ పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. పార్టీ సీనియర్లు మోత్కుపల్లి నర్సింహులు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, తుమ్మల నాగేశ్వరరావు, ఎల్‌.రమణ, ధూళిపాళ నరేంద్రకుమార్‌, పయ్యావుల కేశవ్‌ తదితరులతో మంగళవారం రాత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు, అవిశ్వాసం తీర్మానం విషయంపై కూలంకషంగా చర్చించారు. నేతలు వారి అభిప్రాయాలను అధినేత దృష్టికి తెచ్చారు. అవిశ్వాసంపై ప్రధాన ప్రతిపక్షంగా సరైన సమయంలో నిర్ణయం తీసుకుందామన్న భావనను వారు వ్యక్తం చేశారు. ”ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంతో కనీసం చర్చించకుండా తెరాస అవిశ్వాసం పెడతామని ప్రకటించేసింది. ఎవరిని అడిగి అలా నిర్ణయం తీసుకున్నారు? ఇప్పుడు చివరి నిమిషంలో మద్దతు కోరుతున్నామంటూ ఒక లేఖ రాసేసి మనను బాధ్యులను చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారు విసిరిన వలలో మనం ఎందుకు ఇరుక్కోవాలి” అని నేతలు చంద్రబాబుతో అన్నారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కయిన వారే తిరిగి మనపై బురద జల్లుతున్నారు, ఆ రెండు పార్టీలు ఎలా కుమ్మక్కయ్యాయో ప్రజలకు వివరిద్దాం అని టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు, నాయకులు కూడా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తపరచినట్లు తెలిసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో, అంతకుముందు స్పీకర్‌ ఎన్నికల్లో, 2014 ఎన్నికలయ్యాక యూపీఏతో తమ పార్టీ సంబంధాలు ఎలా ఉంటాయనే దానిపై ఇటీవలే ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైకాపా గౌరవాధ్యక్షురాలు వెల్లడించిన విషయాలు ఇవన్నీ కాంగ్రెస్‌తో వైకాపావారే కుమ్మక్కయ్యారన్నది స్పష్టమైంది కదా అనే వాదన వ్యక్తమైంది. ”కుమ్మక్కయ్యేది వాళ్లు. తిరిగి తెదేపా కుమ్మక్కయిందంటూ బురదజల్లుతున్నారు. వాస్తవాలను ప్రజలకు వివరిద్దాం” అని అనుకున్నట్లు తెలసింది.