” ఇదేనా బంగారు శేరిలింగంపల్లి … మసరుతున్న సమస్యలపై కసురుతున్న మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి”

శేరిలింగంప‌ల్లి, జూన్ 07( జనంసాక్షి): ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు నోరు తెరిస్తే బంగారు తెలంగాణ అని ఊకడంపుడి ఉపన్యాసాలు దంచికొట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఒక్కసారి కల్లిబొల్లి మాటలు కట్టిపెట్టి తనతోకలిసి బహిరంగ చర్చకు వస్తే నిజాలు నిగ్గుతేలుస్తానని చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్, బిజెపి నాయకురాలు నవతారెడ్డి స్పష్టంచేశారు. ఈ మేరకు చందానగర్ డివిజన్ పరిధి జవహర్ నగర్ లో స్థానికుల పిలుపుమేరకు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా జవహర్ నగర్ లో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమక్షంలో మాట్లాడుతూ గత ఎనిమిదేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలంగాణ వెలిగిపోతుంది, దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిచింది, బంగారు తెలంగాణ ఆవిష్కృతమైందని ప్రజల చెవుల నుండి రక్తం కారేలా ఉపన్యాసాలు దంచి కొడుతున్నారని, రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర మొత్తం అవసరం లేదని కేవలం తమ డివిజన్ పరిధిలో టిఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. జవహర్ నగర్ లో భూగర్భ డ్రైనేజీ పైప్లైన్ ను ఏర్పాటు చేస్తామనే వంకతో గతేడాది తవ్వి అలాగే వదిలేసారని, ప్రస్తుతం వర్షాల కారణంగా జవహర్ నగర్ ప్రధాన రహదారి సహా గల్లీ రోడ్లలో ఎక్కడికక్కడ వర్షం నీరుచేరి మోకాలి లోతు బురద తయారైందని, అందులోనుండి స్థానికులు, వాహనదారులు రాకపోకలు సాగించేందుకు నరకయాతన అనుభవిస్తున్నారని నవతారెడ్డి ఎద్దేవా చేశారు. 18 రోజులపాటు పట్టణ ప్రగతి పేరుతో నిధులతోపిడి, పేపర్లకు ఫోటోలు తప్ప వరగబెట్టిందేమీ లేదని ఆమె దుయ్యబట్టారు. గత మూడు నెలలుగా పాడైపోయిన రోడ్డు గురించి కాలనీవాసులు ఎంత మొరపెట్టుకున్నా పట్టణ ప్రగతిలో సైతం పూర్తి చేయలేని గులాబీ కంపెనీ మరో మారు ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని నవతారెడ్డి ప్రశ్నించారు. భారతదేశం, 29 రాష్ట్రాల సమగ్రాభివృద్ధి కేవలం భారతీయ జనతా పార్టీ తోటి సాధ్యమవుతుందని, ఇది తెలంగాణ ప్రజలు గుర్తించిన విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అండ్ కంపెనీ జీర్ణించుకోలేకపోతున్నారని జోస్యం చెప్పారు. వారం రోజుల్లో జవహర్ నగర్ లో తవ్వి వదిలేసిన సిసి రోడ్డును బాగు చేయకపోతే స్థానికులతో కలిసి నడిరోడ్డుపై బైటాయించి ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు చిరంజీవి, రమేష్, భగవాన్ దాస్, కరుణాకరణ్, రాము, నాయుడు తదితరులు పాల్గొన్నారు.