ఇదో అసమర్థ సర్కారు : నాగం

హైదరాబాద్‌, మార్చి 31 (జనంసాక్షి) :
ఇదో అసమర్ధ ప్రభుత్వం.. గ్రామాల్లో 12 గంటల పాటు కూడా విద్యుత్‌ అందించలేని కాంగ్రెస్‌ ప్రభుత్వ మెడలు వంచుదామని తెలంగాణ నగారా సమితి ప్రతినిధి, ఎమ్మెల్యే నాగం జనార్దనరెడ్డి అన్నారు. హైదర్‌గూడ పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద విద్యుత్‌ చార్జీల పెంపునకు నిరసనగా శనివారం రాత్రి నుంచి దీక్ష కొనసాగిస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి నాగం జనార్దనరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అందరం కలిసి ప్రభుత్వానికి బుద్ధి చెబుదామని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లోని ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా అవుతుంటే..కాంగ్రెస్‌ ప్రభుత్వం వల్ల రాష్ట్ర ప్రజలు విద్యుత్‌ కష్టాలతో తల్లడిల్లుతున్నారన్నారు. 18వేల యూనిట్లు అవసరం అయినప్పటికీ 9వేల యూనిట్లను కూడా ఉత్పత్తి చేయలేకపోవడం దారుణమన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఇదిలాఉండగా నాగేశ్వర్‌ కూడా బిజెపి దీక్షశిబిరానికి చేరుకున్నారు. మద్దతు ప్రకటించారు. పెంచిన విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ దీక్షా శిబిరానికి చేరుకుని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బిజెపి చేస్తున్న ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. విద్యుత్‌ను వినిమయ వస్తువుగా గాక విలాస వస్తువుగా ప్రభుత్వాలు  పరిగణిస్తున్నాయని విమర్శించారు. బిజెపి రాష్ట్రఅధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్‌ చార్జీల పెంపు ఘోరమన్నారు. సగటు వేతన జీవి బతకలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు నింగికి చేరాయని, దానికి తోడు విద్యుత్‌ చార్జీలు కూడా పెంచి ప్రజలపై పెనుభారం మోపారన్నారు. విద్యుత్‌ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని లేదా ఆ భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండు చేస్తున్నామని అన్నారు. విద్యుత్‌ చార్జీల విషయంపై ప్రభుత్వం స్పందించేంతవరకు దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.