ఇద్దరు తెలంగాణ న్యాయమూర్తుల సస్పెన్షన్‌

1

– ఉధృతమవుతున్న ‘న్యాయపోరాటం’

హైదరాబాద్‌,జూన్‌ 27(జనంసాక్షి): తెలంగాణ న్యాయాధికారుల ఆందోళనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు కె.రవీందర్‌రెడ్డి, కార్యదర్శి వరప్రసాద్‌లపై సస్పెన్షన్‌ వేటు వేసింది. తెలుగు రాష్ట్రాల  మధ్య న్యాయాధికారులను విభజిస్తూ గత నెల 3న ఉమ్మడి హైకోర్టు విడుదల చేసిన ‘ప్రాథమిక కేటాయింపుల జాబితా’ను నిరసిస్తూ తెలంగాణ న్యాయాధికారులు ఆదివారం నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే.  న్యాయాధికారుల ర్యాలీలో పాల్గొన్నందుకు ఇద్దరు న్యాయాధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈమేరకు సోమవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వరప్రసాద్‌లను సస్పెన్షన్‌ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. జడ్జిల సస్పెన్షన్‌ను నిరసిస్తూ పలువురు తెలంగాణ న్యాయవాదులు హైకోర్టు ఎదుట ధర్నాకు దిగారు. కాగా, ఆంధ్రా న్యాయాధికారులను తెలంగాణకు కేటాయించడాన్ని నిరసిస్తూ నిన్న న్యాయాధికారుల సంఘం ఆధ్వర్యంలో ఛలో రాజ్‌భవన్‌ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే.  క్రమశిక్షణ ఉల్లంఘన కింద ఇద్దరు న్యాయాధికారులపై వేటు వేసింది. మొత్తం వ్యవహారంపై వివరాలు సేకరించిన హైకోర్టు ఈ ఆందోళనకు కారకులైన న్యాయాధికారులపై చర్యకు దిగింది.  ఆప్షన్లను నిరసిస్తూ కొద్దిరోజులుగా న్యాయవాదులు నిరసన బాట పట్టారు. గత వారం ఛలో హైకోర్టుకు కూడా పిలుపునిచ్చారు. ఆందోళనల పర్యవసానంగా లాయర్ల అరెస్టులు చోటు చేసుకున్నాయి. ఇంతకాలం న్యాయవాదులే రోడెక్కి నిరసనల్లో పాల్గొన్నారు. ఇప్పటికే హైకోర్టు విభజనపై తెలంగాణ న్యాయవాదులు భగ్గుమంటున్నారు. అలాంటి సమయంలోనే జడ్జిల ఆప్షన్స్‌ వ్యవహారం వారికి మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. కోర్టు ఉద్యోగులు కూడా లాయర్ల ఆందోళనకు సంఘీభావం తెలియజేశారు. అనూహ్యంగా జడ్జిలు కూడా రోడ్డెక్కడంతో సమస్య మరింత జఠిలమైంది.

ఏపీ పునర్విభజన జరిగి రెండేళ్లవుతున్నా ఇంకా హైకోర్టును రెండుగా విభజించకపోవడం దారుణమని తెలంగాణ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్ర మోహన్‌రావు అన్నారు. ఏపీ న్యాయాధికారులకు ఇచ్చిన ఆప్షన్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.ఛలో రాజ్‌భవన్‌ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇవాళ ఇద్దరు తెలంగాణ జడ్జిలను హైకోర్టు సస్పెండ్‌ చేసిన సందర్భంగా తెలంగాణ న్యాయవాదులు పలుచోట్ల ఆందోళన నిర్వహించారు.  ఇద్దరు న్యాయమూర్తులపై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. కుట్రపూరీతంగానే ఆంధ్రా న్యాయమూర్తులను తెలంగాణలో ఉంచుతున్నారని ఆరోపించారు.