ఇవిఎంలపై కాంగ్రెస్ దిగజారుడు రాజకీయం
రాజకీయాలు ఇప్పుడు ఇవిఎంల చుట్టూ తిరుగుతున్నాయి. గతంలో అనేకమార్లు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ మారోమారు తనతోపాటు, తనకూటమి నేతలతో ఇవిఎంలపై నానాయాగీ చేస్తోంది. ఎవడో కౌన్ కిస్కే గాడు చేసిన ఆరోపణలను ఆధారం చేసుకుని ఇవిఎంల ట్యాంపరింగ్ జరిగిందని చెబుతోంది. మొన్నటికి మొన్న మూడు బిజెపి పాలిత రాష్ట్రాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ నిస్సిగ్గుగా ఇలాంటి ఆరోపణలు చేస్తూ దేశ ప్రతిష్టను విదేశాల్లో దిగజార్చిన తీరు క్షమార్హం కాదు. తెలంగాణలో టిఆర్‌ఎస్ మారోమారు అధికారంలోకి రాగానే ఇవిఎంలదే తప్పని కూడా కాంగ్రెస్ నిందిస్తోంది. ఇవిఎంలతోనే గతంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్, తదితర పార్టీలతో పాటు టెక్ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు కూడా నిస్సిగ్గుగా వంతపాడడం దారుణం కాక మరోటి కాదు. తాము మాత్రమే అధికారంలో ఉండాలన్న దుగ్ధతో చేస్తున్న ఆరోపణలకు ఇవి పరాకాష్టగా చూడాలి. జాతి ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం పట్టని నేతలు అధికార యావలో మగ్గి దేశహితాన్ని పక్కన పెట్టారు. అధికార మత్తులో ఉన్నవారికి ప్రజలు కనిపించడం లేదు. ఏడు దశాబ్దాలు గడిచినా ప్రజల రాతలు మారడం లేదు. మరోమారు అధికారం దక్కించుకోవాలన్న కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తుందనడానికి ఇవిఎంల వ్యవహారంపై రచ్చ చేయడమే నిదర్శనం. దేశానికి క్యాన్సర్‌లా మారిన కాంగ్రెస్ తన పాలనా కాలం యావత్తు కుటుంబ పాలనకు దాసోహమయ్యింది. అందుకే మరోమారు పాలనలోకి రావడం ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కొత్త నాటకానికి తెరలేపింది. దానికి మాయావతి,అఖిలేశ్ యాదవ్, చంద్రబాబు లాంటి వందిమాగధులు వంతపాడుతున్న తీరు వారి దౌర్బల్యాన్ని బయటపెట్టింది. ఇలాంటి వారు ప్రజల సంక్షేమం కోసం పాలన చేస్తారనుకోవడం ప్రజలు దౌర్భాగ్యం కాక మరోటి కాదు. డ్యాష్ బోర్డులు.. కామాండ్ కంట్రోల్ అంటూ దావోస్ వేదికగా పెద్దపెద్ద మాటలు చెబుతున్న వారు పాలనకు అర్హులా అన్నది ఆలోచన చేయాలి. సార్వత్రిక ఎన్నికలకు మరో మాడునాలుగు నెలల ముందుగా ఇవిఎంల ట్యాంపరింగ్ పేరుతో దేశ రాజకీయాల్లో అనవసర చర్చ జరగాలని చూస్తున్నాయి. రాజకీయ పార్టీల ఆరోపణలకు ఎలక్టాన్రిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) కేంద్రబిందువుగా మారాయి. తాజాగా బయటకొచ్చిన ఈవీఎంల హ్యాకింగ్ వివాదం ద్వారా ప్రజల దృష్టి మళ్లించాలని చూస్తున్నారు. వీరు ప్రజలకు తమ పాలనలో ఏం చేశారో జగమెరిగిన సత్యం. 2014 ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ సైబర్ నిపుణుడిగా చెప్పుకున్న సయ్యద్ షుజా ‘స్కైప్’ మాధ్యమం ద్వారా ఆరోపణలు చేస్తే దానిపై విచారణచేయాలని కాంగ్రెస్, దాని వందిమాగధులు కోరడం దుర్మార్గం. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఇవిఎంలను ట్యాంపర్ చేశారో ఇప్పుడు దేశానికి సమాధానం చెప్పాలి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలట్ పత్రాలు ఉపయోగించాలని తెదేపా, బీఎస్పీ డిమాండ్ చేయడం చూస్తుంటే వారికి ప్రజల పట్ల ఎంత భయం ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరిని ప్రజలు తిరస్కరిస్తారన్న భయం వెన్నాడుతోంది. ఈవీఎంలు ప్రజాస్వామ్యానికి పెద్దముప్పుగా పరిణమించాయని తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంటి వ్యక్తి ఆందోళన వ్యక్తం చేయడం సిగ్గుచేటు. దావోస్ వేదికగా సాంకేతికత గురించి పెద్దపెద్ద మాటలుచెబుతున్న వారు ఇలాంటి ఆరోపణలు చేయడం వారి అస్తిత్వాన్ని ప్రశ్నించుకునేదిగా ఉంది. తానే టెక్నాలజీని ప్రమోట్ చేసానని చెప్పుకుంటున్న చంద్రబాబు గత ఎన్నికల్లో ఇవిఎంలను ట్యాంపర్ చేసి గెలిచాడా అన్నది చెప్పాలి. సహజంగానే కాంగ్రెస్ విమర్శల్ని భాజపా తిప్పికొట్టింది. ఇదంతా కాంగ్రెస్ ప్రాయోజిత కుట్ర అని ఆరోపించింది. మరోవైపు ఈ వ్యవహారంపై ఎన్నికల
సంఘం పోలీసులను ఆశ్రయించింది. సయ్యద్ షుజాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై ఈవీఎంల రూపకర్త ఈసీఐఎల్ కూడా స్పందించింది. ఆరోపణలు చేసిన సయ్యద్‌తో తమకేవిూ సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈవీఎంలు రూపొందించిన సాంకేతిక నిపుణుల బృందం ఈ యంత్రాల్ని ట్యాంపర్ చేయడం అసాధ్యమని పునరుద్ఘాటించింది. మొత్తంగా చూస్తే ఇటీవల కూటమి కట్టిన పార్టీలకు ప్రజల్లో విశ్వాసం లేదు. ప్రజలు ఈ పార్టీలను ఛీత్కరిచుకుంటున్నాయి. ఎందుకంటే మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో ఇవిఎంలతో ఎన్నికల్లో టిఆర్‌ఎస్ గెలిచాక..సర్పంచ్ ఎన్నికలు బ్యాలెట్ పత్రాలతో నిర్వహించారు. 90శాతం మంది సర్పంచ్‌లు టిఆర్‌ఎస్ వారే ఎన్నికయ్యారు. ప్రజల మద్దతు ఉంటే ఇవిఎంలు ఉన్నా, బ్యాలెట్ పత్రాలు ఉన్నా గెలవడం ఖాయమని టిఆర్‌ఎస్ రుజువు చేసుకుంది. చౌకబారు విమర్శలు చేస్తున్న రాజకీయ పార్టీలను, నాయకులను ప్రజలు ఓటుతో బుద్ది చెబితే ఇలాంటి ఆరోపణలకు ఆస్కారం ఉండదు. గెలిచింది మొదలు సొంత లాభం తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టించు కోని నేతలు దేశానికి ఉన్నా ఒకటే..లేకున్నా ఒకటే అని గుర్తించాలి. హ్యాకింగ్‌పై సయ్యద్ చేసిన ఆరోపణల పై దర్యాప్తు జరగాలన్న కపిల్ సిబల్ తీరు చూస్తుంటే అతని అమాయకత్వానికి జాలేస్తోంది. ఎవడుపడితే వాడు ఆరోపణలు చేస్తా దానిని సమర్థించడం చూస్తుంటే కపిల్ సిబల్ సమర్థత ఏ పాటిదో తెలుస్తుంది. నిజానికి ప్రజాస్వామ్య సంస్థలను ఇలాంటి వారే బలహీన పరుస్తున్నారు. శాస్త్రసాంకేతికతలో ఎంతో ముందుకు వెళుతున్న వేళ ఈవీఎంలను తప్పుపట్టడం ద్వారా ప్రజలను మోసగించాలనుకోవడం..వారి తీర్పును తప్పుగా చెప్పడం తప్ప మరోటి కాదు. భారత ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల సంఘాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకు లండన్ వేదికగా కాంగ్రెస్ చేసిన కుట్రగానే ఈ మొత్తం వ్యవహారాన్ని చూడాలి. కాంగ్రెస్ చేసిన ప్రాయోజిత కుట్రే ఈవీఎంల హ్యాకింగ్ ఆరోపణ అని భాజపా చేసిన ఆరోపణ నూటికి నూరుపాళ్లు నిజం. కాంగ్రెస్ వాళ్లకు దమ్ముంటే ఇసిఐఎల్‌కు వెళ్లి ఇవిఎంలను పరిశీలించి చూసుకోవాలి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదనే ఉద్దేశంతో సాకులు వెతుక్కోవడానికి ఎవడో చేసిన ఆరోపణల ప్రాతిపదికగా చర్యలకు డిమాండ్ చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్ప మరోటి కాదు.