ఇసుక బంగారమయ్యిందని బాధపడుతూ కూర్చుంటే ఎలా..?

ఇసుక బంగారమయ్యిందని అంటున్న వారు, ఇసుక ద్వారా వేలకోట్ల ఆదాయం సమకూరుతుందని అనుకుంటన్న వారూ అసలు విషయాలు మరచిపోతున్నారు. అందుకే ఇప్పుడు ఇసుకకు ప్రత్యమ్నాయాల గురించి ఆలోచన చేస్తున్నారు. పర్యావరణాన్ని దెబ్బతీయడం వల్లనే ఇవాళ ఇసుక లేకుండా పోయిందని ప్రజలు ఆలోచించడం లేదు. విచ్చలవిడిగా పర్యావరణ విఘాతానికి పాల్పడిన పాపానికి ఇవాళ గ్రామాల్లో ఇసుక అన్నది కనిపించకుండా పోయింది. ఒకప్పుడు వాగులు, వంకలు నిరంతరంగా పారిన సందర్భాల్లో ప్రతి గ్రామంలోనూ అవసరమైన మేరకు ఇసుక లభించేది. ఎవరికి వారు బళ్లు లేదా ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలించుకుని పోయేవారు. అప్పట్లో రవాణా ఛార్జీలు తప్ప ఇసుకకు డబ్బు చెల్లించాల్సి వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఇసుక బంగారమయ్యింది. దీనికి కారణం మనమే అని ప్రజలు తెలుసుకోవాలి. వాగులను పూర్తిగా అడ్డుకుని నీటి జాడలు లేకుండా చేశాం. అంతేగాకుండా విచ్చలవిడిగా కొండలను పగులగొట్టాం. చెట్లను కొట్టి అమ్ముకున్నాం. ఇప్పటికీ నిరంతరంగా ఈ పనులు చేస్తూనే ఉన్నాం. ఒకప్పుడు ఆలేరు వాగునుంచి నిరంతరంగా హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు ఇసుక రావాణా సాగేది. అప్పట్లో ఇసుక లారీలు పెట్టుకున్న వారు సైతం లాభాలా గడించారు. కాలక్రమంలో ఆ వాగు మాయం అయ్యింది. ఆలేరు సవిూపంలో కొలనుపాకను ఆనుకుని ఉన్న యశ్వంతాపూర్‌ వాగు అన్నా వసంతవాగు అన్నా ఎంతో పేరుండేది. అది ఇప్పుడు అంతర్ధానం అయ్యింది. అలాంటి వాగులు ఈ దేశంలో, మన తెలుగు రాష్టాల్ల్రో ఎన్నో కనుమరుగు అయ్యాయి. అంటే వాగు పుట్టుకకు అవసరమైన ఆనవాళ్లను లేకుండా చేశాం. చెట్లను నరకడం, కొండలను పిండి చేయడం వల్ల మైదానాలు ఏర్పడడమే గాకుండా వానలు రాకుండా చేసుకున్నాం. ఇదంత మానవుల స్వయంకృతం కాక మరోటి కాదు. ఇలాంటి వాగులను పునరుద్దరించు కుంటేనే మళ్లీ మనకు మనుగడ ఉంటుంది. ఇలాంటి వాగులు లేకపోవడం వల్ల ఇవాళ మనకు ఇసుక బంగారమై నిర్మాణ రంగం భారంగా మారింది. అందుకే ఇప్పుడు ఇసుక మాఫియా కొత్తగా తయారయ్యింది. అందినకాడికి  దోచుకోవడం లేదా వ్యాపారం ద్వారా దండుకోవడం కోసం ఇప్పుడు ఇసుక మాఫియా పుట్టుకొచ్చింది.  వీరి కారణంగా అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. ఇసుక తవ్వకాలు విచ్చలవిడిగా చేపడుతున్నారు. నది పరివాహక ప్రాంతాలు, వాగులు, వంకల్లో ఇసుక తవ్వకాలను మాఫియా యధేచ్ఛగా నడిపిస్తోంది. దీంతో ఇరు రాష్టాల్ల్రో దాదాపు అన్ని జిల్లాల్లో ఇసుకు రేట్లు అదిరిపోతున్నాయి. విపరీతంగా ధరలు  పెరుగుతున్నాయి. సర్కారు నిర్ణయించిన రేట్ల ప్రకారం కాకుండా ఇష్డారాజ్యంగా ఇసుకను విక్రయిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో టన్నుకు  మూడువేల వరకు అమ్ముతున్నారని అంటున్నారు. ఇలా ఓ మాఫియా పుట్టుకు రావడం వల్ల జరిగే అనర్థాలను మనం గుర్తించాలి. తెలంగాణ జిల్లాల్లో  అక్రమ ఇసుక తవ్వకాలు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఎపిలోని అనంతలో కూడా ఇసుక దక్కడం లేదని ప్రజలు వాపోతున్నారు. అక్కడా ఆందోళనలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని సంగంబండ, కల్వకుర్తి, నెట్టెంపాడు, కృష్ణా, తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాలు, మెదక్‌ జిల్లాలోని సింగూరు, సిద్దిపేట, వరంగల్‌లోని గోదావరి బేసిన్‌, రంగారెడ్డిలోని తాండూరు, వికారాబాద్‌, నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ పరివాహక ప్రాంతాలు, మల్లేపల్లి కేంద్రంగా అక్రమ ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఈ ఇసుకను సవిూప పరిసరాల్లోని పట్టణాలతోపాటు హైదారాబాద్‌, కర్నూలు జిల్లాలకు తరలిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.  కొత్తగా రూపొందించిన ఇసుక విధానం అమల్లోకి వచ్చినా మాఫియాదే పైచేయిగా ఉంది. దీంతో  అక్రమ ఇసుక రవాణా ఆగడం లేదు. నియంత్రణ లేనిమూలంగా సమస్యలు ఎదురవుతున్నాయి. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌శాఖ సమన్వయ లోపంతో ఇసుక మాఫీయాకు లైసెన్స్‌ ఇచ్చినట్లయింది. పోలీసు, రెవెన్యూశాఖ అధికారులు ఇసుక మాఫియా ఇచ్చే మామూళ్లకు అలవాటుపడి చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కొంతమేరకు ఎపిలో కఠినంగానే ఉన్నా మాఫియా మాత్రం తమ ఆగడాలను దాచడం లేదు. ఈ పరిస్థితుల్లో సాధారణ, మధ్యతరగతి ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరాల కోసం అధికరేట్లను పెట్టి కొనాల్సి వస్తోందని అంటున్న వారు ఎక్కువే.  ఇసుకను బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయలేకపోవడంతో చిన్న చిన్న నిర్మాణాలను కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఇసుక ధరలను ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంచలేకపోయిన నేపథ్యంలో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ దుస్థితికి కారణం మనమే అని తెలుసుకోవాలి. నీరు పారినప్పుడే ఇసుక సహజంగా  వస్తుంది. వాగులు, వంకలు, నదుల ద్వారా వచ్చే ఇసుక నాణ్యమైనదిగా ఉంటుంది. ఇప్పుడంతా కల్తీ మయమయ్యింది. ఇసుకలోనూ మట్టిని కలిపి విక్రయిస్తున్నారు. ఈ సంక్షోభం పోవాలంటే ప్రజల్లో మార్పు రావాలి. భవిష్యత్‌లో ఇసుక దక్కాలంటే మళ్లీ మనం చెట్లు పెంచాలి. వాగులను రక్షించాలి. వాననీటిని గలగలా  పారేలా చేసుకోవాలి. అప్పుడు వాగులు మళ్లీ పుట్టుకుని వస్తాయి. వర్షపు నీరు నిలుస్తుంది. పర్యావరణం బతుకుంది. ఇసుక కూడా పుడుతంది. ఇలా ఇసుక చుట్టూ పర్యావరణ పరిరక్షణ దాగి ఉందన్న నిజాన్ని గ్రహించి ముందుకు సాగాల్సిన తరుణం ఇదే. లేకుంటే ప్రమాదం పొంచి ఉందని గుర్తుంచుకోవాలి.