ఈఆర్‌సీ ఎదుట ధర్నా,ఉద్రిక్తత
వామపక్షాలు, తెరాస ఉమ్మడిపోరాటం
పాల్గొన్న బి.వి.రాఘవులు, నారాయణ, హరీశ్
హైదరాబాద్, డిసెంబర్ 3 (జనంసాక్షి):
పెంచిన సర్‌చార్జీలను తొలగించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, టీఆర్‌ఎస్ ఈఆర్‌సీ కార్యాలయం ఎదుట సోమవారం చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. ఈఆర్‌సీ ఏర్పాటు చేసిన అభిప్రాయ సేకరణ కార్యక్రమం సందర్భంగా రాజకీయ పక్షాలు నిరసన వ్యక్తం చేస్తూ కార్యా లయం లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయ త్నించారు. పెంచిన సర్‌చార్జీలు తొలగిం చాలంటూ డిమాండ్ చేస్తూ అధికారుల ఎదుట నాయకులు బైఠా యించారు. పోలీసులు వారిని అడ్డుకునేం దుకు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సీపీఐ కార్యదర్శి నారాయణ, సీపీఎం కార్యదర్శి రాఘవులు, టీఆర్‌ఎస్ ఎల్పీ ఉప నేత హరీష్‌రావు, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు, విద్యుత్ కోతలు, సర్‌చార్జీల విధింపు తదితర అంశాలకు వ్యతిరేకంగా విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) కార్యాలయం ఎదుట పది వామపక్ష పార్టీలు, టీఆర్‌ఎస్, బీజేపీ ధర్నా నిర్వహించాయి. తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ పక్ష నాయకుడు హరీష్‌రావు టీఆర్‌ఎస్ తరఫున ఈ చర్చా వేదికలో పాల్గొన్నారు. వామపక్షాల ధర్నాకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం సామాన్యులపై భారం మోపుతూ, పారిశ్రామిక వేత్తలకు రాయితీలు ఇస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం వేసిన ప్రభుత్వం సర్‌చార్జీలను కూడా వేయడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు తాము ఊరుకునేది లేదని హెచ్చరించారు.
సర్‌చార్జీలపై ప్రత్యక్ష ఉద్యమం: హరీష్‌రావు
రాష్ట్రంలో ప్రజలపై వేసిన విద్యుత్ సర్ చార్జీల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోకపోతే ఇక ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమవుతామని టీఆర్‌ఎస్ నాయకుడు హరీష్‌రావు హెచ్చరించారు. ఈఆర్‌సీ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రైతులపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని, విద్యుత్ కోతతో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. అన్ని ధరలు పెరిగిపోయి ప్రజలు బతకలేని పరిస్థితుల్లో ఉంటే అన్నింటిపై భారం వేయడం సరికాదన్నారు. పోరాటాలు చేసి ప్రభుత్వం మెడలు వంచుతామని ఆయన హెచ్చరించారు.