ఈజిప్టు తరహాలో ఉద్యమం
ఆక్య్‌పై వాల్‌స్ట్రీట్ మూవ్‌మెంటే మాకు ఆదర్శం
టీ జేఏసీ చైర్మన్ కోదండరాం
తెలంగాణ ప్రకటించే వరకూ హైదరాబాద్‌లోనే ‘సాగరహారం’
ప్రపంచ దృష్టిని ఆకర్శించే స్థాయిలో సెప్టెంబర్ మార్చ్
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (జనంసాక్షి) :
ఈ నెల 30లోపు కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించకుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ మార్చ్ ఆగదని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. ఇక ముందు అమెరికా ఆర్థిక పునాదులను కదిలించిన ‘ఆక్యుపై వాల్ స్ట్రీట్ ఉద్యమం’ ఆదర్శంగా ఈజిప్టు తరహా ఉద్యమాన్ని నడిపిస్తామని ఆయన వెల్లడించారు. 30న ట్యాంక్ బండ్ నిర్వహించే ‘సాగర హారం’ తెలంగాణ ఏర్పాటు వరకు కొనసాగుతుందని కోదండరాం ఉద్ఘాటించారు. మిలియన్ మార్చ్‌లాగే తెలంగాణ మార్చ్ కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో బీజేపీ నాయకులను కలుసుకొని తెలంగాణ మార్చ్‌కు మద్దతివ్వాల్సిందిగా కోరారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కిరణ్, తెలంగాణమంత్రులపై విరుచుకుపడ్డారు. తెలంగాణ మార్చ్‌ను విఫలం చేసే విధంగా ప్రభుత్వంభయాందోళనలు సృష్టించే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. అరెస్టులకు, బ్యారీకేడ్లకు తెలంగాణ ప్రజలు భయపడరన్నారు. తెలంగాణ డిమాండ్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ సాధన కోసమే మార్చ్ తలపెట్టామని, తెలంగాణ ప్రకటించండి లేదా మార్చ్‌కు అనుమతించండని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత నేతలు ప్రజల వైపుకు ఉంటారో ఉండరో తేల్చుకోవాలని కోదండరాం ఆల్టిమేటం ఇచ్చారు. జానారెడ్డి బాధ్యత కలిగిన నేతగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యమంత్రి పదవి కోసం మంత్రి జానారెడ్డి ఆరాటపడుతున్నారని, అందుకే తెలంగాణ విషయంలో ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణవాదుల డిమాండ్లపై స్పష్టత ఇవ్వని సీఎం కవాతును వాయిదా వేసుకోవాలని అడుగుతున్నారని కోదండరాం విమర్శించారు. పదవుల కోసం కాకుండా తెలంగాణ మంత్రులు రాష్ట్ర సాధన కోసం బాధ్యతగా ప్రవర్తించాలని సూచించారు. కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం సీమాంధ్ర ప్రభుత్వమని, సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలను కాపాడేందుకే ఈ ప్రభుత్వం చూస్తోందన్నారు. సీమాంధ్ర ప్రాంత నాయకుల అహంకారానికి, పెత్తనానికి వ్యతిరేకంగా తాము మార్చ్ చేస్తున్నామన్నారు. మార్చ్‌ని శాంతియుతంగా నిర్వహిస్తామని, అందుకు ప్రభుత్వం కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో తెలంగాణపై మంత్రులకు, నాయకులకు లేఖ రాస్తామని వెల్లడించారు. మార్చ్ శాంతియుతంగా సాగేందుకు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమ్మక్క సారక్క జాతరకు పోయినట్లు, మక్కాకు పోయినంత పవిత్రంగా, క్రీస్తు శాంతి ప్రవచనాలు బోధిస్తూ శిలువ మోస్తూ సాగిన మాదిరిగా సాగుదామన్నారు. మా ప్రాంతాన్ని మేం పాలించుకోవడానికే ఈ పోరాటమని కోదండరాం స్పష్టం చేశారు. మార్చ్‌ను అడ్డుకునే ఉద్దేశంలో భాగంగా తెలంగాణ నుండి హైదరాబాద్ వచ్చే అన్ని మార్గాల్లో ప్రభుత్వం బారికేడ్లు ఏర్పాటు చేస్తోందని మండిపడ్డారు. ఈ నెల 30లోగా ప్రధాని తెలంగాణపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కవాతులో పాల్గొనే తెలంగాణవాదులు ఎక్కడా ఆగ్రహానికి గురి కావద్దని, మీడియాకు సహకరించాలని కోరారు. గాంధేయ మార్గంలో తమ నిరసనను వ్యక్తం చేయాలని కోదండరాం కోరారు. మార్చ్‌ను అడ్డుకునేందుకు, హింసాత్మకం చేసేందుకు సీమాంధ్రులు కుట్ర పన్నుతున్నారని, ఈ కుట్రలన్నింటిని తెలంగాణ బిడ్డలు శాంతియుతంగా తిప్పి కొట్టి, మార్చ్‌ను విజయవంతం చేయాలని కోదండరాం కోరారు.