ఈసీ తీర్పును స్వాగతిస్తున్నా – కేసీఆర్..
ఖమ్మం : పాలేరు ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, సహ రిటర్నింగ్ ఆఫీసర్ లను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఉప ఎన్నిక తీరుపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. బుధవారం ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కార్యకర్తలు ప్రథమ స్థానంలో నిలుస్తారని, ఈ విషయం పలు పత్రికలు కూడా పేర్కొన్నాయని తెలిపారు. ఎన్నో ఇబ్బందులకు గురయినా తట్టుకుని రాష్ట్రాన్ని సాధించడం జరిగిందన్నారు. శాంతియుతంగా, అహింసాయుతంగా ఉద్యమాన్ని కొనసాగించడం జరిగిందని, దేశ రాజకీయ వ్యవస్థను, 36 రాజకీయ పార్టీలను ఒప్పించడం జరిగిందన్నారు. తదనంతరం ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా ముందుకు వెళ్లడం జరిగిందని, ఇందులో కార్యకర్తలు కీలక పాత్ర పోషించారని తెలిపారు.
బాధ్యతల నుండి తప్పుకోవాలని సూచనలు..
2014లో రాష్ట్రం ఆవిర్భవించడం జరిగిందని, బాధ్యతల నుండి తప్పుకోవాలని కొందరుసూచనలు చేశారని తెలిపారు. కానీ బాధ్యతల నుండి తప్పుకోవద్దని మేధావులు..ఇతర వర్గాల వారు సూచనల మేరకే ఎన్నికల బరిలో దిగడం జరిగిందన్నారు. కరెంటు కోతలు రావాలని పక్క రాష్ట్రం యత్నించడం జరిగిందని, ఎన్నో బాలారిష్టాలు ఎదుర్కొని నిలబడడం జరిగిందన్నారు. అధికారం వచ్చిందని గర్వానికి లోను కాలేదని తెలిపారు.
సమైక్య పాలనలో నిర్లక్ష్యం..
ఖమ్మంలో నది పారుతున్నా కరవు ఎందుకుందని కేసీఆర్ ప్రశ్నించారు. సమైక్య పాలకుల నిర్లక్ష్యం వైఖరి వల్లే ఈ దుస్థితి నెలకొందన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తరువాత పదవుల కోసం వెంపర్లాడలేదని, తన వంతు కోసం కార్యకర్తలు వేచి ఉండాలని సూచించారు. పదవుల రాలేదని చిన్నబుచ్చుకోవద్దని తెలిపారు.
త్వరలో పోస్టుల భర్తీ..
శాసనసభా సంఖ్య పెరిగే అవకాశం ఉందని, దీనిపై ఢిల్లీలో ప్రయత్నాలు చేయడం జరుగుతోందన్నారు. మరో 34 కొత్త ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం ఉందని, అలాగే ఎమ్మెల్సీల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. నాలుగు వేల మంది కార్యకర్తలకు త్వరలో పోస్టులు వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణకు బాస్ లు ప్రజలేనని, వర్తమానం, భవిష్యత్ పై దృష్టి సారించాలని సూచించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టారని, వరంగల్ ఎంపీగా గెలిచిన పసునూరి సాధారణ కార్యకర్త అని పేర్కొన్నారు.