-ఈ నెల 14న జానపద కళాకారుల ప్రదర్శన,

-16న సాయంత్రం కవి సమ్మేళనం.
ఆసక్తి గల కవులు పేర్లు నమోదు చేసుకోవాలి.
-జిల్లా పౌర సంబంధాల అధికారి,పి. సీతారాం.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు 10(జనంసాక్షి):
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ నెల 14వ తేదీన జానపద కళాకారుల ప్రదర్శన,16వ తేదీన సాయంత్రం కవి సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన దలచిన కవులు, కళాకారులు, ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలు తమ పేర్లను జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో నమోదు చేసుకోవాలని జిల్లా పౌర సంబంధాల అధికారి, పి. సీతారాం బుధవారం ప్రకటనలో తెలిపారు.ఆగస్టు 14వ తేదీన నాగర్ కర్నూల్ ప్రభుత్వ బాలుర పాఠశాల ఆవరణలో నిర్వహించే జానపద కళాకారుల ప్రదర్శన కార్యక్రమానికి జిల్లాలోని ఆసక్తి గల కళాబృందాలు, పాఠశాలలు తమ పెరు, చేయనున్న ఆర్ట్ ఫామ్, ఎన్ని నిమిషాల నిడివి వంటి వివరాలు డి.పి.ఆర్.ఓ కార్యాలయంలో ఆగస్టు 12వ తేది సాయంత్రం లోగా నమోదు చేసుకోవాలని కోరారు. ప్రదర్శనలు దేశభక్తి కి సంబంధించి ఉండాలన్నారు. ప్రదర్శన చేసే కళాకారులకు ప్రశంసా పాత్రలు, శాలువలతో సత్కరించటం జరుగుతుందని ఎలాంటి పారితోషికం ఇవ్వబడదని తెలిపారు. అదేవిధంగా ఆగస్టు 16వ తేదీన సాయంత్రం నాగర్ కర్నూల్ సహకార పరపతి సంఘం(పిఏసిఎస్) సమావేశ మందిరంలో మధ్యాహ్నం 3 గంటల నుండి జరిగే కవి సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొనదలచుకున్న కవులు తమ పేర్లను 13వ తేది సాయంత్రం5 గంటల వరకు నమోదు చేసుకోవాలన్నారు.భారత స్వాంతంత్య్ర సంగ్రామం, ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల పై తమ కవిత్వాన్ని 3 నిమిషాల్లో చదవగలిగేంత రాసి తమ పేరు, సెల్ నెంబరుతో డి.పి.ఆర్.ఓ కార్యాలయంలో 13వ తేదీ సాయంత్రం వరకు అందజేయాలని కోరారు.